English | Telugu

రోమాంచమ్ మూవీ రివ్యూ

సినిమా పేరు: రోమాంచమ్
నటీనటులు: సౌబిన్ షాహిర్, అర్జున్ అశోక్, చెంబన్ వినోద్ జోస్, అనంతరామన్ అజయ్, అబిన్ బినో, సిజు సన్నీ, అఫ్జల్ , జగదీష్ కుమార్, జోమోన్ జ్యోతిర్, దీపికా శివ, స్నేహా మాథ్యూ, తంకం మోహన్, జాలీ చిరయత్
సినిమాటోగ్రఫీ: సాను తాహిర్
ఎడిటర్: కిరణ్ దాస్
సంగీతం: సుశీన్ శ్యామ్
నిర్మాతలు: జాన్ పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్
కథ, దర్శకత్వం: జితు మాధవన్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాలకు తెలుగులో ఆదరణ పెరిగింది. ఒక చిన్న పాయింట్ ని తీసుకొని, దాని చుట్టూ కథని అల్లుకొని, ఆసక్తికరమైన కథనంతో నడిపించే తీరు ఎందరినో ఆకట్టుకుంటుంది. తాజాగా మలయాళంలో రూపొందిన హర్రర్ కామెడీ మూవీ 'రోమాంచమ్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ:

ఒక అతను హాస్పిటల్ లో బెడ్ మీద ఉండి అంతా చూస్తుంటాడు. కానీ అతనికి ఏమీ సరిగ్గా కనిపించదు. డాక్టర్ వచ్చి అతడిని చూసి నువ్వు కోమాలోకి వెళ్ళావ్.. ఇప్పుడు లేచావని అతనితో చెప్పగా అవునా అని షాక్ లో ఉంటాడు. కోమాలోంచి లేచిన అతను జీవన్(సౌబిన్ షాహిర్).. జీవన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడాలని డాక్టర్ కి చెప్పగా ... నువ్వు ఇంకా ఐసీయూలోనే ఉన్నావని, నిన్ను జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసాక నీ స్నేహితులని కలవొచ్చని చెప్తాడు. అలా కాదు డాక్టర్ నేనిప్పుడే వాళ్ళని కలవాలని కోరగా..‌ అయితే ఆ గోడకి ఉన్న ఫోటో ఫ్రేం ఎవరిదో సరిగ్గా చెప్తే మీ ఫ్రెండ్స్ ని కలవొచ్చని డాక్టర్ చెప్తాడు. కానీ అతనికి సరిగ్గా కనిపించదు. దాంతో అది తెలుసుకోమని డాక్టర్ చెప్పగా.. అదే వార్డ్ లో పనిచేస్తున్న ఒక నర్స్ ని పరిచయం చేసుకొని ఆ ఫోటో ఫ్రేమ్ గురించి అడిగి తెలుసుకొని మరుసటిరోజు డాక్టర్ రాగానే అదే సమాధానం చెప్పగా డాక్టర్ నర్స్ ని పిలిచి తిడతాడు. ఆ తర్వాత మరో ఫోటో ఫ్రేమ్ చూపించి తెలుసుకోమనగా.. అక్కడి నర్స్ సహాయం చేయనంటుంది. అసలు మీ ఫ్రెండ్స్ ని ఎందుకు కలవాలని అనుకుంటున్నావని ఆ నర్స్ అతడిని అడుగగా తన గతాన్ని నర్స్ కి చెప్తూ ఉంటాడు. తనతో కలిపి ఏడుగురు ఫ్రెండ్స్ కలిసి బెంగుళూరు సిటీకి చివరల్లో ఒక ఇంట్లో ఉంటున్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ.. అదేంటో‌ తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కోమా నుండి లేచి‌న జీవన్(సౌబిన్‌ షాహిర్) తనకి తెలిసిన ఒక నిజాన్ని అతడి స్నేహితులకు తెలియజెప్పడానికి.. గతంలో జరిగిన అతడి స్టోరీని అక్కడ నర్స్ తో షేర్ చేస్తూ ఉండటంతో ఈ కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. జీవన్ కి స్నేహితులంటే ఎంత ఇష్టమో‌ చూపించే సీన్స్ బాగుంటాయి.‌ ఎప్పుడు గొడవలు‌ పడుతూ మళ్ళీ కలిసిపోయే బ్యాచిలర్స్ పాత్రలను బాగా రూపుదిద్దాడు డైరెక్టర్.

జీవన్ తో పాటు అతని‌ ఆరుగురు ‌స్నేహితులు‌ కలిసే ఉంటారు. వాళ్ళు ఆడిన ఒక ఆట వారికి లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేలా ఉంటుందని మొదట తెలుసుకోలేక సరదాగా ఒక గేమ్ లా ఆడతారు. ఆ తర్వాత అసలు సమస్యలు ఒకదాని వెనుక ఒకటి మొదలవుతూనే ఉంటాయి. ఓయిజా బోర్డ్ మీద ఒక గాజు గ్లాస్ పెట్టి ఆ ఏడుగురు స్నేహితులు ఆత్మను రమ్మని పిలవగా ఒక ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ తనపేరు అనామిక అని చెప్తుంది. దీంతో అందరు భయానికి లోనవుతారు. ‌అక్కడ ఉన్న స్నేహితులలో‌ ఒకరు ఆ బోర్డ్ ని కాలితో తన్నేస్తాడు. అక్కడ నుండి వారికి సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. సెకంఢాఫ్ లో వచ్చే శీను పాత్ర సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. అతడు మూవీలోకి వచ్చినప్పటి నుండి చివరి వరకు ప్రతీ సీన్ సస్పెన్స్ తో పాటు కామెడీని అందిస్తూనే సరిపడా హర్రర్ ని జోడించిన విధానం చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి.

హర్రర్ సస్పెన్స్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం.. మొదటి నుండి చివరి వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఈ మూవీ మొదటి నుండి చివరి వరకు ఎక్కడా కూడా అసందర్భ హాస్యం లేదు.. అసందర్భ ఫైట్ సీక్వెన్స్ లేవు. చాలా సహజ సిద్ధంగా మన మధ్యలో కథ జరుగుతున్నట్టుగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. బ్యాచిలర్స్ పాత్రలకు ప్రతీ ఒక్కరికి తగిన స్కోప్ ని ఇచ్చి సినిమాలో వారి పాత్రలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచిన కిరణ్ దాస్ ఎడిటింగ్ బాగుంది. ఉన్న రెండు పాటల్లోను సుశీన్ శ్యామ్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. సాను తాహిర్ కెమరా పనితనం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో గేమ్ ఆడుతున్నప్పుడు స్లో మోషన్ సీన్లను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఈ మూవీ మొత్తంలో ఎక్కువగా తెలిసిన వ్యక్తి జీవన్ పాత్ర పోషించిన సౌబిన్ షాహిర్. అతడు జీవన్ పాత్రలో ఒదిగిపోయాడు. మరో ప్రధానమైన పాత్ర నీరజ్.. ఇంట్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్ అందరికి సమానమైన పనులను అప్పగించి వారిని మార్చేదిగా ఉండే ఈ క్యారెక్టర్ ప్రతీ ఇంట్లో ఉండే ఇంటిపెద్దగా అనిపిస్తుంది. ఇక మిగతా వారంతా వారి వారి పాత్రలలో బాగా నటించారు. ద్వితీయార్థంలో వచ్చే శీను(అర్జున్ అశోక్) పాత్ర ఈ మూవీకి ఆయువుపట్టుగా నిలిచింది. ముఖ్యంగా అతని హావభావాలు మూవీ చూసే ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఒకానొక దశలో శీనుకి దెయ్యం పట్టినట్టుగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

హర్రర్ కంటే కామెడీ ఎక్కువగా ఉన్న ఈ సినిమాని హర్రర్-కామెడీ జోనర్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు హ్యాపీగా చూడొచ్చు.

రేటింగ్: 3.5/5

✍🏻. దాసరి మల్లేశ్

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.