English | Telugu
ప్రభాస్, మహేష్ తో ఢీ కొడుతున్న మాస్ రాజా!
Updated : Jun 12, 2023
ఈ దసరాకు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజ రవితేజ రెండు, మూడు నెలల వ్యవధిలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో అలరించనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఈగల్' అనే టైటిల్ పెట్టినట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను వదిలారు. భవనాల్లా పేర్చి ఉన్న ఆయుధాల మధ్య రవితేజ తుపాకీ పట్టుకొని అటువైపు తిరిగి ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. అలాగే టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని కూడా విడుదల చేశారు. "ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి?.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలు ఏంటి?" అంటూ రూపొందించిన వీడియో సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. రవితేజ-కార్తీక్ కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది.
కాగా, టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా "ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని" అంటూ ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో 2024 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', మహేష్ బాబు 'గుంటూరు కారం' సంక్రాంతికి రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ సంక్రాంతి పోరులోకి రవితేజ 'ఈగల్' వచ్చి చేరింది. ఒకటేమో పాన్ వరల్డ్ చిత్రంగా ప్రచారం పొందుతోంది. మరొకటేమో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ తో వస్తున్న మూడో సినిమాగా భారీ అంచనాలతో వస్తోంది. మరి ఈ పోరులో మాస్ రాజా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.