English | Telugu
రతన్‌టాటా మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం!
Updated : Oct 10, 2024
భారత దేశానికి ఇది ఓ దుర్దినం. దేశ ప్రజలు ఓ రత్నాన్ని కోల్పోయారు. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సృష్టించి దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన రతన్‌టాటా(86) కన్నుమూశారు. ముంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులతోపాటు సామాన్య ప్రజలు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి : భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు.. రతన్‌టాటా లాగా ఎవరూ దేశానికి సేవ చేయలేరు. ఆయనలా జీవించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన గొప్ప పారిశ్రామికవేత్త, పరోపకారి. ఆయన అందించిన విరాళాలు, టాటా బ్రాండ్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణానికి అద్భుతంగా దోహదపడటం గురించి అందరికీ తెలిసిందే. నిజంగా అయన మెగా ఐకాన్. మన దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది.
నాగార్జున : రతన్ టాటా జీ.. భారతదేశం మిమ్మల్ని మిస్ అవుతుంది.. మీ వినయం, మీ కరుణ, మీ నాయకత్వం.. శాంతితో విశ్రాంతి, కీర్తిలో విశ్రాంతి సార్.
ఎన్టీఆర్ : వ్యాపార దిగ్గజం, గొప్ప వ్యక్తి.. మంచి మనసు.. రతన్ టాటా జీ నిస్వార్థ దాతృత్వం, దూరదృష్టి గల నాయకత్వం లెక్కలేనన్ని జీవితాలను మార్చేశాయి. భారతదేశం అతనికి కృతజ్ఞతతో రుణపడి ఉంటుంది. ఇక మీరు ఆ స్వర్గంలో విశ్రాంతి తీసుకోండి.
వీరుకాక వరుణ్‌తేజ్, నాని, సుధీర్‌బాబు, రానా దగ్గుబాటి, సాయిధరమ్‌తేజ్, ప్రకాష్‌రాజ్, అంజలి, నయనతార, దేవిశ్రీప్రసాద్, ఎస్.ఎస్.రాజమౌళి, డైరెక్టర్ బాబీ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా రతన్ టాటా పట్ల తమకు ఉన్న గౌరవాన్ని, ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు.