English | Telugu
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి!
Updated : Oct 10, 2024
ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు వినని వారు భారతదేశంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా అతని సినిమాలకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఒక డైరెక్టర్‌గా అతనికి ఉన్న విజన్. అపజయం అనేది ఎరుగని డైరెక్టర్‌గా ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌తో ఒక అడ్వంచరస్ యాక్షన్ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఒక కొత్త జోనర్‌లో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. మహేష్‌తో రాజమౌళి సినిమా అనే ప్రకటన వచ్చిన రోజు నుంచే మహేష్ అభిమానులు, రాజమౌళి అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు తన జైత్రయాత్రను కొనసాగించి మరో విజువల్ వండర్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. ఈ సందర్భంగా అతను డైరెక్ట్ చేసిన సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి, ఆయా సినిమాలకు లభించిన పురస్కారాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.
స్టూడెంట్ నెం.1 : ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై కె.రాఘవేంద్రరావు, సి.అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. 2001లో విడుదలైన ఈ సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే రూ.20 కోట్లు గ్రాస్, రూ.12 కోట్లు షేర్ కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
సింహాద్రి : ఎన్టీఆర్‌తో రాజమౌళి చేసిన రెండో సినిమా ఇది. వి.ఎం.సి. ప్రొడక్షన్స్ పతాకంపై వి.దొరస్వామిరాజు నిర్మించిన ఈ సినిమా 2003లో విడుదలైంది. రూ.8.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 44 కోట్లు గ్రాస్ రూ.26 కోట్లు షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
సై : 2004 నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శ్రీ భారతి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎ.భారతి నిర్మించారు. రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 19 కోట్లు గ్రాస్, రూ.11 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదట డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత హిట్ సినిమా అనిపించుకుంది.
ఛత్రపతి : 2005లో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. రూ.13 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.28 కోట్లు గ్రాస్, రూ. 17 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. సింహాద్రి బడ్జెట్, ఛత్రపతి బడ్జెట్స్‌తో పోలిస్తే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. సినిమాకి సూపర్‌హిట్ అనే టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్‌గా, పవర్‌ఫుల్‌గా సెకండాఫ్ లేదనే టాక్ వచ్చింది. దానివల్లే ఈ రేంజ్ కలెక్షన్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విక్రమార్కుడు : 2006లో రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శ్రీకీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్‌చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.33 కోట్లు గ్రాస్, రూ.19 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
యమదొంగ : 2007లో మూడోసారి ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై చెర్రీ, గుణ్ణం ఊర్మిళ ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్లు గ్రాస్, రూ.29 కోట్లు షేర్ కలెక్ట్ చేసి హిట్ సినిమా అనిపించుకుంది.
మగధీర : 2009లో ఈ సినిమా విడుదలైంది. అప్పటివరకు రాజమౌళి చేసిన 6 సినిమాలు ఒక ఎత్తయితే.. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా, బడ్జెట్ పరంగా పూర్తి భిన్నమైంది. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా రాజమౌళికి ఎక్కువ ప్రశంసలు లభించిన సినిమా ఇది. రామ్‌చరణ్ హీరోగా రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు గ్రాస్, రూ.75 కోట్లు షేర్ కలెక్ట్ చేసి అప్పటివరకు ఉన్న కలెక్షన్స్‌ను అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది.
మర్యాద రామన్న : మగధీర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసే సినిమా విషయంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్‌కి గురి చేసింది. సునీల్ హీరోగా ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని 2010లో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ నుంచి ఒక్కసారిగా తక్కువ బడ్జెట్‌కి వచ్చేసి రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్లు గ్రాస్, రూ. 29 కోట్లు షేర్ కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈగ : మర్యాద రామన్న తర్వాత నాని హీరోగా ఇంకా తక్కువ బడ్జెట్‌తో సినిమా చెయ్యాలనుకున్నారు రాజమౌళి. తెలుగు, తమిళ భాషల్లో మొదలు పెట్టిన ఈ సినిమాకి అనూహ్యంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. 2012లో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.100 కోట్లు గ్రాస్, రూ.54 కోట్లు షేర్ కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ అయింది.
బాహుబలి(ది బిగినింగ్) : ఈగ తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా దిశగా రాజమౌళి ప్రయాణం సాగింది. ప్రభాస్‌తో రెండో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేశారు. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌కి నిర్మాతలు. మొదటి భాగాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజమౌళితోపాటు చిత్ర యూనిట్ కూడా ఎంతో శ్రమకోర్చి నిర్మించారు. 2015లో విడుదలైన ఈ సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫైనల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.575 కోట్లు గ్రాస్, రూ.287 కోట్లు షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది.
బాహుబలి(ది కన్‌క్లుజన్) : రెండో భాగం కోసం చిత్ర యూనిట్ మరో రెండు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. 2017లో విడుదలైన ఈ సినిమా కోసం రూ.250 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.1745 కోట్లు గ్రాస్, రూ.807 కోట్లు షేర్ కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.
ఆర్‌ఆర్‌ఆర్ : 2022లో విడుదలైన ఈ సినిమా మరో చరిత్ర సృష్టించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించారు. రూ.550 కోట్ల బడ్జెట్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్లు గ్రాస్, రూ.608 కోట్లు షేర్ కలెక్ట్ చేసి మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఎంతో పాపులర్ అయిన ‘నాటు నాటు’ పాటకుగాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించింది.
ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడం, వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడం, మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే అద్భుతాలు సృష్టించడం రాజమౌళి లక్ష్యం. అనుక్షణం ఆ దిశగా ప్రయాణిస్తూ తను చేసే ప్రతి సినిమానూ ఓ విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారు. ఇంతటి ప్రతిభాశాలికి ప్రేక్షకుల రివార్డులతోపాటు ఎన్నో అవార్డులు కూడా లభించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘ఈగ’ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు, ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ‘బాహుబలి ది కంక్లుజన్’ చిత్రానికి సంపూర్ణ వినోదాన్ని అందించిన సినిమాగా జాతీయ అవార్డుకు ఎంపికైంది.
రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ‘మగధీర’ చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా, ‘ఈగ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డులు అందుకున్నారు రాజమౌళి. ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రానికి కూడా ఉత్తమ దర్శకుడు అవార్డు వరించింది. అలాగే 2014లో బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. అంతేకాదు, ఉత్తమ దర్శకుడుగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు రాజమౌళి. వీటితోపాటు ఉత్తమ దర్శకుడుగా రెండు సినీ‘మా’ అవార్డులు, మూడు సైమా అవార్డులు రాజమౌళిని వరించాయి. గతంలో కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమై ఉన్న తెలుగు సినిమా మార్కెట్‌కి ఎవ్వరూ ఊహించని స్థాయిని తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా రాజమౌళిదే. తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాలతో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ ఈ దర్శకదిగ్గజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.