English | Telugu
‘స్కంద’ లో రామ్ ద్విపాత్రాభినయం!
Updated : Sep 12, 2023
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ‘స్కంద’ సినిమా ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన పంథాలో ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా రిలీజైన స్కంద ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అవగతమవుతుంది. ఇందులో గమనిస్తే రామ్ రెండు లుక్స్‌లో కనిపిస్తున్నారు. అసలు ఇలా కనిపించటానికి కారణం తనేమైనా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్న కూడా అందరి మదిలో మెదిలింది. అయితే సినీ సర్కిల్స్ లేటెస్ట్ సమాచారం మేరకు ‘స్కంద’ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేశారట.
ఇదే కనుక నిజమైతే రామ్ ఇలా ద్విపాత్రాభినయం చేయటం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు రెడ్ చిత్రంలో ఈ యంగ్ ఉస్తాద్ డబుల్ రోల్‌లో కనిపించి అలరించిన సంగతి తెలిసింతే. ఇప్పుడు స్కంద సినిమాలోనూ డ్యూయెల్ పాత్రలతో రామ్ ఆకట్టుకోబోతున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న రిలేషన్.. వేరియేషన్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనట. బోయపాటి శ్రీను తన సినిమాల్లో నందమూరి బాలకృష్ణనే డ్యూయెల్ రోల్‌లో చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రామ్ వంతు వచ్చింది. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. అది కూడా పాన్ ఇండియా చిత్రంగా. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీత సారథ్యాన్ని వహించారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేసిన సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే తమ తొలి పాన్ ఇండియా ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలని బోయపాటి శ్రీను, రామ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేద్దామని ప్రకటన ఇచ్చారు. ఎప్పుడైతే సలార్ మూవీ వాయిదా పడుతుందనే విషయంలో తెలిసిందో.. అప్పుడు స్కంద మూవీ సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు.