Read more!

English | Telugu

షాకింగ్.. 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి ఆస్కార్స్ ఎంట్రీ ఫ్రీ కాదు!

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా 'నాటు నాటు' పాటకి ఆస్కార్ అవార్డు అందుకొని 'ఆర్ఆర్ఆర్' సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 'నాటు నాటు'కి ఆస్కార్ రావడం పట్ల తెలుగువారు మాత్రమే కాకుండా భారతీయులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆస్కార్స్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ కి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసినవారు కూడా ఉన్నారు. వేదిక పైకి వెళ్లి అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ మినహా మిగతా టీమ్ అంతా ఎక్కడో చివరన, ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఆస్కార్ మేనేజ్ మెంట్ పై విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అసలు ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఆస్కార్ వేడుకలకు ఉచిత పాస్ లు రాలేదట. ఆ వేడుక ఎంట్రీ టికెట్ కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఖర్చయిందట.

నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. అవార్డు అందుకోవడానికి వెళ్లిన కీరవాణి, చంద్రబోస్ కి మాత్రమే ఆస్కార్ వేడుకలకు ఫ్రీ ఎంట్రీ దొరికిందని, మిగతా ఆర్ఆర్ఆర్ సభ్యులంతా లక్షలు చెల్లించి ఎంట్రీ టికెట్స్ కొనుకున్నారని సమాచారం. అందుకే కీరవాణి, చంద్రబోస్ ముందు వరుసల్లో కూర్చుంటే.. దర్శకుడు రాజమౌళి సహా మిగతా సభ్యులంతా ఎక్కడో వెనక కూర్చున్నారని అంటున్నారు. ఆస్కార్ 2023 వేడుకల కోసం ఒక్కో టికెట్ ధర 25 వేల డాలర్లు(రూ.20.6 లక్షలు) కాగా.. ఆ చారిత్రాత్మక క్షణాన్ని కళ్లారా చూడాలని భావించిన రాజమౌళి తనతో పాటు మిగతా సభ్యులకి కూడా టికెట్లు కొన్నారట. రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకలలో పాల్గొనగా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒంటరిగానే పాల్గొన్నాడు.

మొత్తానికి ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం మాత్రమే కాదు.. ఆస్కార్స్ చూడటానికి కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ భారీగా ఖర్చు చేసిందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.