English | Telugu
పుష్ప-2 రికార్డుల మోత.. 829 కోట్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!
Updated : Dec 9, 2024
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప-2 ది రూల్' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం, విడుదల తర్వాత తర్వాత సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. (Pushpa 2 The Rule)
'పుష్ప-2' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి, భారత సినీ చరిత్రలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కూడా అదే జోరుని కొనసాగిస్తూ.. ఆల్‌టైమ్ రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. రెండు రోజుల్లో రూ.449 కోట్లు, మూడు రోజుల్లో రూ.621 కోట్లతో.. నెవర్ బిఫోర్ వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో పుష్ప-2 తన హవాను మరింత చూపించింది. దీంతో మొదటి వీకెండ్ లోనే ఏకంగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన.. తొలి భారతీయ చిత్రంగా 'పుష్ప-2' సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. (Pushpa 2 Collections)
ప్రస్తుతం పుష్ప-2 జోరు చూస్తుంటే.. మరో రెండు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా వస్తున్న ఈ వసూళ్లు చూస్తుంటే.. త్వరలోనే భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'పుష్ప-2' నిలిచినా ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు.
ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2.. ముఖ్యంగా హిందీ గడ్డ మీద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. హిందీలో నాలుగో రోజు రూ.86 కోట్ల నెట్ వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో రూ.86 కోట్ల నెట్‌ను సాధించలేదు. అలాగే, హిందీలో నాలుగు రోజులకు రూ. 291 కోట్ల నెట్ కలెక్ట్ చేసి.. ఇప్పటివరకు అత్యంత వేగంగా, అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 291 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా కూడా పుష్ప-2 నిలిచింది.
ఇలా ఎన్నో రికార్డులను పుష్ప-2 చిత్రం కైవసం చేసుకుంటోంది. ఒక రికార్డు ప్రకటించే లోపే, మరో కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం.. యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది.