English | Telugu
పుష్పరాజ్‌ను ఇబ్బంది పెడుతున్న షెకావత్.. మరో వివాదంలో ‘పుష్ప2’!
Updated : Dec 9, 2024
‘పుష్ప2’ రిలీజ్‌కి ముందు చెప్పిన డేట్ రిలీజ్ అవుతుందా లేక వాయిదా పడుతుందా అనే టెన్షన్. మరో పక్క మెగా అభిమానుల వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే టెన్షన్... ఇన్ని టెన్షన్స్ మధ్య డిసెంబర్ 5న రిలీజ్ అయిన ‘పుష్ప2’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే రిలీజ్ ముందు రోజు జరిగిన విషాద ఘటన హీరోతోపాటు చిత్ర యూనిట్‌ని కూడా కలచివేసింది. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించిన ‘పుష్ప2’ సక్సెస్ మీట్‌లో అది స్పష్టంగా కనిపించింది. స్టేజ్‌పైకి వచ్చి మాట్లాడిన వారందరిలోనూ ఏదో నిరాసక్తత ఉన్నట్టు అనిపించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన తాలూకు నిరసనలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘పుష్ప2’కి ఒక కొత్త సమస్య వచ్చింది. ‘పుష్ప’ చిత్రంలో చివరి 15 నిమిషాలు మాత్రమే కనిపించి తన వల్ల పుష్పరాజ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ముందుగానే చెప్పిన భన్వర్‌సింగ్ షెకావత్ దాన్ని ‘పుష్ప2’లో కంటిన్యూ చేశాడు. సినిమాలో హీరో తర్వాత ఈ క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమాలో పుష్పరాజ్ పాత్రను ఇబ్బందులకు గురిచేసే షెకావత్ రియల్‌గా సినిమాని ఇబ్బందుల్లో పడేస్తున్నాడు. సినిమాలో షెకావత్ అనే పేరును ఒక నెగెటివ్ క్యారెక్టర్‌కి వాడినందుకు ఒక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.
‘పుష్ప2’ చిత్రానికి నార్త్ బెల్ట్‌లో విపరీతమైన ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. సినిమాలో షెకావత్ అనే పేరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సినిమాలో పేరును పదే పదే వాడడంతోపాటు దాన్ని నెగెటివ్‌గా చూపించడాన్ని రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ తప్పుబడుతున్నారు. క్షత్రియుల్ని ఈ పాత్ర ద్వారా అవమానిస్తున్నారని, దీనిపై పోరాటం చేసేందుకు కర్ణి సైనికులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సినిమాలోని షెకావత్ అనే పేరును తొలగించాలని, లేకపోతే కర్ణి సైనికులు నిర్మాతల ఇంటిపై దాడి చేస్తారని ఆ వర్గం హెచ్చరిస్తోంది.