English | Telugu

‘పుష్ప 2’ ఎఫెక్ట్‌... ‘గేమ్‌ ఛేంజర్‌’కి ఇది కోలుకోలేని దెబ్బ!

 

పుష్ప2 రిలీజ్‌కి ముందు ఆ మేనియా దేశమంతా పాకింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. గత నెలరోజులుగా మీడియాలో, సోషల్‌ మీడియాలో ఇదే టాపిక్‌ నాన్‌స్టాప్‌గా రన్‌ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సినిమాకి ఇంత హైప్‌ రాలేదు. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప2 అందరూ అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్‌ సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు కలెక్ట్‌ చేసిందని అనధికార సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ మొదటి రోజు కలెక్షన్‌ రికార్డ్సును పుష్ప2 క్రాస్‌ చేసేసింది. శుక్రవారం మైత్రి మూవీ మేకర్స్‌ మొదటి రోజు కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఇంత హెవీగా ఉండడానికి కారణం పెంచిన టికెట్‌ ధరలేనని స్పష్టంగా తెలుస్తోంది. దశలవారీగా పెంచిన ఈ ధరలు దాదాపు 15 రోజులు అమలులో ఉంటాయి కాబట్టి పుష్ప2 కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. (Pushpa 2 The Rule)

 

ఇదిలా ఉంటే.. సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) విడుదల కాబోతోంది. పుష్ప2తో కంపేర్‌ చేస్తే గేమ్‌ ఛేంజర్‌కి ఉన్న హైప్‌ అంతంత మాత్రమే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పుష్ప సినిమా పెద్ద హిట్‌ అవ్వడం, ఉత్తమనటుడిగా అల్లు అర్జున్‌ నేషనల్‌ అవార్డు అందుకోవడం వంటివి పుష్ప2పై ఎక్కువ ప్రభావాన్ని చూపించడంతో విపరీతమైన హైప్‌ వచ్చింది. కానీ, గేమ్‌ ఛేంజర్‌పై ప్రేక్షకుల్లో సాధారణ అంచనాలు మాత్రమే ఉన్నాయి. మరోపక్క డైరెక్టర్‌ శంకర్‌ చేసిన భారతీయుడు2 భారీ డిజాస్టర్‌ కావడం కూడా రామ్‌చరణ్‌కి మైనస్‌ అయింది అంటున్నారు. ఏ విధంగా చూసినా గేమ్‌ఛేంజర్‌కి రికార్డు స్థాయిలో మాత్రం కలెక్షన్స్‌ ఉండవు అనేది వాస్తవం. 

 

గేమ్‌ ఛేంజర్‌కి కలెక్షన్ల పరంగా మరో షాకింగ్‌ న్యూస్‌ కూడా సర్క్యులేట్‌ అవుతోంది. పుష్ప2 రిలీజ్‌ ముందురోజు బెనిఫిట్‌ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్‌లో జరిగిన దుర్ఘటన కారణంగా ఇకపై బెనిఫిట్‌ షోలకు పర్మిషన్స్‌ ఇవ్వబోం అని సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం గేమ్‌ ఛేంజర్‌ యూనిట్‌కి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల మనుగడ మొదటి వారం టికెట్‌ రేట్లను పెంచుకోవడం, బెనిఫిట్‌ షోలు వేయడం వంటి వాటిపైనే ఆధారపడి ఉంది. మంత్రి చెప్పిన దాన్ని బట్టి బెనిఫిట్‌ షోలకు పర్మిషన్స్‌ ఉండవు. అలాగే టికెట్‌ ధరల పెంపు విధానం, అదనపు షోలు వంటి వాటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే గేమ్‌ ఛేంజర్‌కి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణపరంగా చాలా ఆలస్యమైంది. దానికితోడు బడ్జెట్‌ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాత తన ఆశలన్నీ మొదటివారం తమ సినిమాకి జరిగే బెనిఫిట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక అలాంటి బెనిఫిట్స్‌పై ఆశలు పెట్టుకోవద్దని మంత్రి చేసిన ప్రకటన వల్ల అర్థమవుతోంది. మొదటి రోజు కలెక్షన్స్‌తోనే పుష్ప2 రికార్డులు సృష్టించింది. ఫుల్‌ రన్‌లో కూడా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏ రకంగా చూసినా ఇది గేమ్‌ఛేంజర్‌కి పెద్ద దెబ్బే అనేది స్పష్టంగా తెలుస్తోంది.