English | Telugu
మరోసారి వివాదంలో చిక్కుకున్న 'ఆదిపురుష్'.. కొత్త కేసు!
Updated : Apr 10, 2023
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇప్పుడు మళ్లీ సమస్యల్లో చిక్కుకుంది. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ అనే వ్యక్తి తాజాగా ఆదిపురుష్ టీమ్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మేథో చౌర్యం జరిగిందని అన్నారు. ప్రభాస్ హీరోగా, కృతిసనన్ నాయికగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఓం రవుత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆ మధ్య అయోధ్యలో జరిగింది. టీజర్‌లో యానిమేషన్ క్వాలిటీగా లేదంటూ విమర్శలొచ్చాయి. దాంతో ముందు అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయకుండా వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమాలో రామలక్ష్మణులకు జంధ్యం లేదంటూ నార్త్ లో పోలీస్ కంప్లయింట్లు చేసిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చేస్తున్న ఆరోపణలు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. తాను గతంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ప్యాటర్న్స్ తీసుకుని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా వాడుకున్నారన్నది ప్రధాన ఆరరోపణ.
ప్రతీక్ మాట్లాడుతూ ``ఇలాంటివారికి నిబద్ధత ఉండదు. చేస్తున్న పనిని ప్రాణం పెట్టి చేయాలన్న ఆలోచన ఉండదు. అందుకే ఇలాంటి మేథో చౌర్యానికి పాల్పడుతుంటారు. ఆదిపురుష్ విజువల్ డిజైనర్ టి.పి.విజయన్ చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు స్క్రీన్ మీద ఫెయిల్ కావడానికి కూడా ఈ తరహా టెక్నీషియన్లే కారణం. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. నా ఒరిజినల్ వర్క్ కి సంబంధించిన లింకు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను`` అని అన్నారు. మర్యాదపురుషోత్తముడి కథతో ఓం రవుత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఇటీవల హనుమంతుడి పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. త్రీడీలో తెరకెక్కుతోంది. మన పురాణాల గురించి యువకులు, పిల్లలు తెలుసుకోవడానికి ఇది చక్కటి మాధ్యమం అని అన్నారు ఓం రవుత్. హైదరాబాద్‌లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శకుడు.