English | Telugu
తప్పు చేస్తే కఠిన చర్యలు.. సినిమా ఇండస్ట్రీకి కొత్త పోలీస్ కమిషనర్ హెచ్చరిక!
Updated : Dec 13, 2023
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ బాధ్యతలు తీసుకున్న వెంటనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం అధికమైందని దాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ సేవిస్తున్నారని, దాన్ని మానుకుంటే మంచిదని సూచించారు. డ్రగ్స్‌ని సేవించేవారిపై, డ్రగ్స్‌ని సరఫరా చేసేవారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపబోతోందని హెచ్చరించారు. త్వరలోనే సినీ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి డ్రగ్స్‌పై అవగాహన కలిగిస్తామన్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు అవహేళనగా మారిందని, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండడం కష్టమైన పనేనని తెలిపారు. చట్టాన్ని గౌరవించేవారిని పోలీస్ శాఖ కూడా గౌరవిస్తుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. డ్రగ్స్‌ని అరికట్టేందుకు పోలీస్ శాఖ ఎంతో కృషి చేసింది, ఇకపై కూడా చేస్తుందని గుర్తు చేసిన సిపి సినిమా ఇండస్ట్రీలో రకరకాల పార్టీలు జరుగుతుంటాయని, అందులో డ్రగ్స్ సేవిస్తారని మాకు సమాచారం ఉందని అన్నారు సి.పి. కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అయితే ప్రతి రంగంలోనూ మంచి, చెడు అనేవి ఉంటాయని, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారంతా చెడ్డవారని, డ్రగ్స్ వినియోగిస్తారని చెప్పడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తాము నివాసం ఉంటున్న ఏరియాలో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకాలాపాలు జరిగితే మనకెందుకులే అని ఊరుకోకుండా తమకు అందుబాటులో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా డ్రగ్స్‌ని సమూలంగా నిర్మూలించడంలో పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. డ్రగ్స్‌ని కూకటి వేళ్ళతో సహా పెకిలించాలన్నదే మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారి లక్ష్యమని, ఆ దిశగా పోలీస్ శాఖ కూడా పనిచేస్తుందని అన్నారు.