English | Telugu

తన డైలాగులతో హీరోలకు కమర్షియల్‌ రేంజ్‌ని, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచిన పరుచూరి గోపాలకృష్ణ!

సినీ రచయితల్లో పరుచూరి బ్రదర్స్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ సోదరులు కలిసి కొన్ని వందల సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఇద్దరు రచయితలు కలిసి పనిచేసే సంప్రదాయం బాలీవుడ్‌లోనే ఎక్కువగా ఉంది తప్ప టాలీవుడ్‌లో లేదు. తమ కెరీర్‌ ప్రారంభం నుంచీ ఇద్దరూ కలిసే సినిమా రచన చేసేవారు. అన్నయ్య వెంకటేశ్వరరావు సెంటిమెంట్‌ని పండిరచడంలో దిట్ట అయితే.. తమ్ముడు గోపాలకృష్ణ ఎమోషనల్‌ సీన్స్‌, ఫెరోషియస్‌ డైలాగులు రాయడంలో ప్రసిద్ధుడు. 1990వ దశకంలో వీరు రచయితలుగా పనిచేసిన ఎన్నో సినిమాలు కమర్షియల్‌గా భారీ సక్సెస్‌లు అందుకున్నాయి. వీరిద్దరూ కలిసి 10 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. పరుచూరి గోపాలకృష్ణ విషయానికి వస్తే.. రచయితగానే కాదు, నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పరుచూరి వెంకటేశ్వరరావు కూడా కొన్ని సినిమాల్లో నటించినా, గోపాలకృష్ణ చేసిన పాత్రలు మాత్రం విప్లవ ధోరణిలో ఉంటాయి. సెప్టెంబర్‌ 25 పరుచూరి గోపాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 

పరుచూరి గోపాలకృష్ణ 1947 సెప్టెంబర్‌ 25న కృష్ణాజిల్లా మేడూరులో జన్మించారు. ప్రభుత్వ సిటీ సైన్స్‌ కళాశాల నుండి బిఎస్‌సి, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న ఆర్ట్స్‌ కళాశాల నుండి ఎంఎ. తెలుగు చేశారు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత 2003లో ‘తెలుగు సినిమా సాహిత్యం, కథ, కథనం, శిల్పం’ అనే పరిశోధనాంశంపై దృష్టి సారించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సినిమా సాహిత్యంలో పీహెచ్‌డీని పొందారు. ఒరిస్సాలోని బెర్హంపూర్‌ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో డాక్టరేట్‌ను పొందారు. గోపాలకృష్ణ 7 ఆగష్టు 1971 నుండి 1 సెప్టెంబర్‌ 1975 వరకు పశ్చిమ గోదావరిలోని చిననీంద్ర కొలనులోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఓరియంటల్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా, అడుసుమిల్లి గోపాలకృష్ణ అండ్‌ షుగర్‌ కేన్‌లో తెలుగు శాఖాధిపతిగా మరియు వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. గ్రోవర్స్‌ కళాశాల, వుయ్యూరు, కృష్ణా జిల్లా 2 సెప్టెంబర్‌ 1975 నుండి ఏప్రిల్‌ 1983 వరకు లెక్చరర్‌గా పనిచేశారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. కొద్దికాలం అటు సినిమాలలో పనిచేస్తూనే ఇటు బోధన కూడా కొనసాగించారు. సినిమాలు విజయవంతం కావడంతో సినీరంగంలోనే భవిష్యత్తు నిర్ణయించుకుని ఉద్యోగాన్ని వదిలేశారు. 

పరుచూరి ద్వయం రచయితలుగా సాధించిన విజయాలు అనేకం. కథ, స్క్రీన్‌ప్లేలోగానీ, డైలాగ్స్‌లోగాని తమ ప్రత్యేకతను చూపిస్తూ కమర్షియల్‌ హీరోల సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఫెరోషియస్‌ డైలాగ్స్‌ రాయడంలో గోపాలకృష్ణకు మంచి పట్టు ఉంది. ‘గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్‌కే గుండాగి చస్తావ్‌రా..,  ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..’ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’ అనే డైలాగులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ డైలాగులన్నీ గోపాలకృష్ణ రాసినవే. 

1978లో వచ్చిన ‘చలిచీమలు’ చిత్రానికి మాటలు రాయడం ద్వారా సినిమా రంగంలో ప్రవేశించారు పరుచూరి బ్రదర్స్‌. 1981లో ఈ సోదరులిద్దరూ మహానటుడు యన్‌.టి.రామారావును కలుసుకున్నారు. ఆయన వారిద్దరినీ కలిపి ‘పరుచూరి బ్రదర్స్‌’గా పేరు మార్చి తన ‘అనురాగదేవత’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.  సమకాలీన సమస్యలను పురాణగాథలతో పోల్చి, వాటిని అనుసంధానించి రచనలు చేయడంలో మేటి అనిపించుకున్నారు పరుచూరి బ్రదర్స్‌. ఎమోషన్‌ పండిరచే సమయంలో పరుచూరి గోపాలకృష్ణ తన పురాణ పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకొనేవారు. అందుకే ఆయన రాసిన సంభాషణల్లో తరచూ మన పురాణగాథల్లోని విశేషాలు వినిపిస్తూ ఉంటాయి. యన్టీఆర్‌తో వారి అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన రాజకీయాల్లోకి వెళ్తూ చివరగా నటించిన ‘నాదేశం’ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ రచన చేశారు. ఆయన నటజీవితంలో చివరి సినిమాగా రూపొందిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’కు కూడా వారే కథ, మాటలు అందించారు. ఇక చిరంజీవిని ‘ఖైదీ’గా జనం మదిలో నిలపడంలోనూ, బాలకృష్ణను పవర్‌ ఫుల్‌ మాస్‌ హీరోగా మలచడంలోనూ, వెంకటేశ్‌ను స్టార్‌గా మార్చడంలోనూ పరుచూరి బ్రదర్స్‌ కలం బలం దాగుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగినట్టుగా తమ రచనా శైలిని మార్చుకుంటూ ముందుకెళ్తున్న పరుచూరి బ్రదర్స్‌లో పరుచూరి గోపాలకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్‌ 25. ఆయనకు పుట్టినరోజు శుభాకాక్షలు తెలియజేస్తూ మేటి రచయితగా పేరు తెచ్చుకున్న ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని విజయవంతమైన సినిమాలకు రచన చేయాలని ఆకాంక్షిస్తోంది తెలుగువన్‌.