English | Telugu
దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి ప్లీజ్!
Updated : Sep 12, 2024
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను ప్రాణంగా ప్రేమించేవారు ఎందరో ఉంటారు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక ఎన్టీఆర్ అభిమాని.. తన చివరి కోరిక 'దేవర' (Devara) సినిమా చూడటమని చెప్పడం కంటతడి పెట్టించేలా ఉంది.
తిరుపతికి చెందిన కౌశిక్ (19) ఎన్టీఆర్ కు వీరాభిమాని. అయితే అతను 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్ వై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుండగా.. ఆ సినిమా చూసే వరకైనా తనను బతికించాలని కౌశిక్ డాక్టర్లను వేడుకుంటున్నాడు.
ఈ విషయాన్ని కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ద్వారా తెలియజేశారు. "కౌశిక్ కి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. రెండేళ్లుగా కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం రూ.60లక్షల దాకా ఖర్చు అవుతుంది. 'నేను బతకనని తెలుసు. దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి చాలు. ఇదే నా చివరి కోరిక' అని కౌశిక్ అన్నాడు." అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకున్నారు. తన కొడుకు చివరి కోరిక తీర్చాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ను ఆమె వేడుకున్నారు.
కౌశిక్ పరిస్థితి గురించి తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. కౌశిక్ చివరికోరిక తీర్చాలని, అవసరమైతే అతని కోసం ప్రత్యేక షో వేయాలని సోషల్ మీడియా వేదికగా దేవర టీంని కోరుతున్నారు. అలాగే కౌశిక్ ని బతికించడానికి ఏమాత్రం అవకాశమున్నా అతనికి ట్రీట్ మెంట్ చేపించి బ్రతికించాలని ఎన్టీఆర్ ను విజ్ఞప్తి చేస్తున్నారు.