English | Telugu
నిఖిల్ 'స్పై' వాయిదా.. 'సామజవరగమన' అంటున్న శ్రీవిష్ణు!
Updated : Jun 12, 2023
'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని తెలుస్తోంది.
'స్పై' సినిమాని జూన్ 29 న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ విడుదల తేదికి ఇంకా 20 రోజులు కూడా లేదు. ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. ఇంత తక్కువ సమయంలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకోవడం కష్టమవుతుంది. పైగా ఇదే డేట్ కి రిలీజ్ చేయాలి, ఎలాగైనా త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కంగారుపడితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో తప్పులు దొర్లి.. అది సినిమా క్వాలిటీ పైనా, రిజల్ట్ పైనా ప్రభావం చూపే అవకాశముంది. ఇవన్నీ ఆలోచించే సినిమా విడుదల వేయడం మంచిదని నిఖిల్ భావించాడట. అయితే ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చే ఒత్తిడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న నిర్మాత వాయిదా నిర్ణయాన్ని మొదట తప్పుబట్టారట. కానీ తొందరపడి రిలీజ్ చేసి, ఏదైనా నెగటివ్ జరిగితే బాధపడే కంటే.. కాస్త ఆలస్యమైనా మంచి అవుట్ పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాత కూడా ఫైనల్ గా వాయిదా వేయడమే కరెక్ట్ అనుకున్నారట.
నిఖిల్ 'స్పై' వాయిదా పడటంతో శ్రీవిష్ణుకి రూట్ క్లియర్ అయింది. ఆయన నటిస్తున్న 'సామజవరగమన' చిత్రాన్ని జూన్ 29 న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్ పై శ్రీవిష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నాడు.