English | Telugu

బాబాయ్ పైనే భార‌మంతా!

2015లో నంద‌మూరి హీరోల హ‌వా కొన‌సాగుతోంది. అబ్బాయిలు ప‌టాస్‌, టెంప‌ర్‌ల‌తో హిట్టు కొట్టారు. ఇది నంద‌మూరి నామ సంవ‌త్స‌రం అని నిరూపించారు. ఇప్పుడు భారమంతా బాబాయ్ బాల‌కృష్ణ‌పైనే. నిజంగానే 2015 నంద‌మూరి హీరోల‌దే అని నిరూపించాలంటే.... బాబాయ్ కీ హిట్ ప‌డాల్సిందే. లేదంటే అబ్బాయిల శ్ర‌మ వృథా అవుతుంది. బాబాయ్ ల‌య‌న్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. లెజెండ్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది. కాబ‌ట్టి అంచ‌నాలు భారీగానే ఉంటాయి. మ‌రో ప‌క్క టైటిల్ అదిరిపోయింది. సింహ శ‌బ్దంతో బాల‌య్య చేసిన సినిమాల‌న్నీ దాదాపుగా హిట్టే. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి క‌లిసొస్తుంద‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంది. అయితే మ‌రో సెంటిమెంట్ బాల‌య్య‌ని బాగా భ‌య‌పెడుతోంది. అదేంటంటే.. ఓ సూప‌ర్ హిట్ ఇచ్చిన త‌ర‌వాత బాలయ్య‌కు ఫ్లాపులు వ‌రుస క‌ట్టాయి. ఈమ‌ధ్య చూసుకొంటే సింహాకీ లెజెండ్ కి మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫ్లాపే. అంత‌కు ముందు స‌మ‌ర‌సింహారెడ్డికీ న‌ర‌సింహా నాయుడుకి మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌న్నీ దారుణంగా ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకొన్నాయి. అంటే బాల‌య్య‌కు ఓ హిట్టొస్తే.. మ‌రో హిట్టుకొట్ట‌డానికి చాలాకాలం ప‌డుతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఎప్పుడూ లేవు. దాంతో పాటు బాల‌య్య ఎప్పుడు కొత్త ద‌ర్శ‌కుడ్ని ఎంచుకొన్నా.. వాళ్లు ముంచేశారు. మ‌రి ఈ చరిత్ర‌ను తిర‌గ‌రాస్తాడా?? స‌రికొత్త చ‌రిత్ర సృష్టించే సత్తా ఈ ల‌య‌న్‌కు ఉందా?? స‌త్య‌దేవ్ బాల‌య్య న‌మ్మాకాన్ని నిల‌బెట్టుకొంటాడా?? తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి.