English | Telugu

ఇది ఘోరం, పాపం, అరాచకం.. తిరుమల లడ్డు ఘటనపై మోహన్‌బాబు ఆగ్రహం!

యావత్‌ భారతదేశాన్ని కుదిపేస్తున్న అంశం కలుషితమైన తిరుమల లడ్డు ప్రసాదం. దీనిపై అన్ని రంగాల ప్రముఖుల, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఇది హేయమైన చర్య అని విమర్శిస్తున్నారు. హిందువుల గౌరవానికి అప్రతిష్ట కలిగించే వారిని ఉపేక్షించవద్దని, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు తిరుమల లడ్డు ప్రసాదం విషయమై ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘ప్రపంచవ్యాప్తంగా హిందువులు పూజించే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డులో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు మూడు నెలల క్రితం వరకు జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మా మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతిఘోరం, నికృష్టం, అతినీచం, హేయం అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు, మిత్రుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఈ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకొని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆ ప్రకటనలో తెలిపారు మంచు మోహన్‌బాబు.