English | Telugu

జానీ మాస్టర్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు!

ఈమధ్య కాలంలో ఎక్కువ చర్చనీయాంశంగా మారిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ వివాదం గురించి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు ఇద్దరిలోనూ తప్పుంది అంటుంటే, మరికొందరు ఎప్పుడో అత్యాచారం జరిగితే ఇప్పుడు కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క జానీ మాస్టర్‌ భార్య ఆయేషా కూడా శ్రష్టిపై పలు ఆరోపణలు చేస్తోంది. ఏది ఏమైనా ఈ కేసు ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. దానికి సంబంధించిన విచారణ కూడా చేపట్టారు. ఇప్పటికే జానీ మాస్టర్‌కి రిమాండ్‌ విధించి జైలుకు తరలించారు. శ్రష్టి చేసిన ఆరోపణలు నిజమేనని, జానీ నేరం ఒప్పుకున్నాడనే కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. అయితే నిజానిజాలు ఏమిటి, పోలీసులు ఈ విషయంలో ఏం చెబుతారనే దానిపైనే అందరి దృష్టీ ఉంది. 

ఇదిలా ఉంటే.. జానీ, శ్రష్టి వివాదంపై నటి రోజా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. ‘ఒక అమ్మాయికి మోసపూరితమైన మాటలు చెప్పి లొంగ దీసుకోవాలనుకోవడం, అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకోవడం అనేది ముమ్మాటికీ తప్పు. అది ఏ రంగంలోనైనా జరగొచ్చు. ఎక్కడ జరిగినా తప్పు తప్పే. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. హీరో అయినా, డైరెక్టర్‌ అయినా టెక్నీషియన్‌ అయినా.. తప్పు చేస్తే తప్పకుండా శిక్షించబడాలి. వారికి కోర్టు కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే భవిష్యత్తులో అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుంది. ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. ఇప్పుడు వాళ్ళంతా వెలుగులోకి వస్తున్నారు. మేం కంప్లయింట్‌ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు అని పశ్నిస్తున్నారు. 

ఒక అమ్మాయి తనకు ఇలాంటి నష్టం జరిగింది అని పబ్లిక్‌గా చెప్పడానికి ఎంతో కష్టపడుతుంది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. తనకు జరిగిన నష్టాన్ని బయటికి చెప్పడం వల్ల తర్వాత సొసైటీ తనని ఎలా చూస్తుందోననే భయం ఉంటుంది. నలుగురిలో ఎలా తిరగగలుగుతాను అనే ఫీలింగ్‌ కూడా ఉంటుంది. అయితే కొంతమంది ఇలాంటి విషయాలను బయటికి చెప్పకుండా తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తప్పు జరిగిపోయింది కాబట్టి అలాగే కంటిన్యూ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయంలో ఆర్టిస్టులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దాన్ని ఎంత తీవ్రంగా పరిగణించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఉంది కాబట్టి నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది చెప్పలేం. అది ఎంక్వయిరీలో తేలాల్సిన విషయం’ అన్నారు.