Read more!

English | Telugu

కృష్ణాష్ట‌మి మూవీ రివ్యూ

 
 
ఈ సినిమాకి కృష్ణాష్ట‌మి అని కాకుండా.. ఉగాది అని పెట్టాల్సింది. కాస్త‌యినా జ‌స్టిఫికేష‌న్ జ‌రిగేది. ఎలాగంటారా?
ఉగాది ప‌చ్చ‌ళ్లు బోలెడ‌న్ని రుచులుంటాయి.
ఈ సినిమాలో.... బోల్డ‌న్ని క‌థ‌లుంటాయి.
ఓ యాంగిల్ నుంచి చూస్తే బావ‌గారు బాగున్నారా?
ఇంకో యాంగిల్ ప‌ట్టుకొంటే.. సంతోషం, బృందావ‌నం
వెనుక నుంచి చూస్తే. జ‌యం మ‌న‌దేరా?
ఇలా క‌ల‌గాపులంగా క‌థ‌ల‌తో.. హంగామా చేశారు. అన్ని రుచుల్నీ మిక్స్ చేశారు కాబట్టి ఈ మిక్చ‌ర్ క‌థ‌కు ఆపేరే క‌రెక్ట్‌. దిల్‌రాజుకి స‌క్సెస్ ఫార్ములాలు బాగా తెలుసు,  సునీల్‌కి నేను కూడా హిట్ ఇవ్వ‌లేను.. అనుకొని.. పాత సినిమాల ఫార్ములాల‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ క‌థ త‌యారు చేసుకొన్నారేమో అనిపిస్తుంది. మ‌రి ఆ ఆతుకుల బొంతైనా క‌రెక్టుగా కుట్టాలి క‌దా?  ఆ విష‌యంలో అయినా దిల్ రాజు అండ్ కో స‌క్సెస్ అయ్యారా?  లేదా?   అస‌లు ఈ కృష్ణాష్ట‌మి అన‌బ‌డే ఉగాది క‌థ ఎలా ఉంది?  చూద్దాం రండి.

క‌థ
 
 కృష్ణ (సునీల్‌) అమెరికాలో ఓ వీడియో గేమింగ్ డిజైనింగ్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. ఇండియాలో ఉండే మావ‌య్య‌ (ముఖేష్ రుషి) అత్త (తులసి)  దగ్గరకు తిరిగి రావాలని ప‌ద్దెనిమిదేళ్లుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాడు. కానీ.. వాళ్లిద్ద‌రూ అందుకు ఒప్పుకోరు. కృష్ణ‌కు ఇండియాలో ప్రాణ గండం ఉంది. అదీ వాళ్ల భ‌యం. కానీ ఇండియాపై ప్రేమ చావ‌క‌.. ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా ఫ్లైట్ ఎక్కేస్తాడు. మార్గ మ‌ధ్య‌లో ప‌ల్ల‌వి (నిక్కీ గ‌ల్రాని)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అజ‌య్, వాళ్ల‌బ్బాయితోనూ ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. కృష్ణ ఇండియాలో అడుగుపెట్ట‌గానే.. అత‌నిపై ఓ ఎటాక్ జ‌రుగుతుంది. ఆ ప్ర‌మాదంలో అజ‌య్ గాయ‌ప‌డి కోమాలోకి వెళ్లిపోతాడు. అజ‌య్ కొడుకుని తీసుకొని... అజ‌య్ ఇంటికి వెళ్తాడు కృష్ణ‌. అక్క‌డ అజ‌య్ ఇంట్లోవాళ్ల‌ని చూసి షాక్ అవుతాడు. ఇంత‌కీ కృష్ణ‌పై ఎటాక్ చేసిందెవ‌రు?  కృష్ణ‌కు ఎవ‌రితో ప‌గ‌? అజ‌య్ ఇంట్లో ఏం జ‌రిగింది?  అనేది తెర‌పై చూడాలి.
 
ఎనాలసిస్ :
 
క‌థ ఇలా చెబితే కాస్తో కూస్తో కొత్త‌గా అనిపించొచ్చు. కానీ.. తెర‌పై అంత సీన్ లేదు. ఏ స‌న్నివేశం చూసినా... ప‌ది ప‌ది హేను సినిమాలు వ‌రుస పెట్టి గుర్తొచ్చేస్తుంటాయి. ఆఖ‌రికి ఇంట్ర‌వెల్ ట్విస్టుతో స‌హా. పాత క‌థ‌ల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ ఎంచుకోవ‌డం త‌ప్పు కాదు. కానీ... ఆ క‌థ‌ల్ని తెర‌పై ఎలా చూపిస్తున్నాం?  తెలిసిన క‌థ‌నే ఆస‌క్తిగా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నాం అన్న‌ది ఇంపార్టెంటు.  ఆవిష‌యంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇంత సాదా సీదా క‌థ‌తో దిల్‌రాజు బ్యాన‌ర్‌లోంచి సినిమా ఎలా వ‌చ్చింద‌బ్బా?  అనిపించినా ఆశ్చ‌ర్యం లేదు. సునీల్ ది కామెడీ ఫేసు. అత‌ను ఎన్ని వంద‌ల సినిమాల్లో న‌వ్వించాడు?  హీరో అయ్యాక ఇంకా ఎక్కువ న‌వ్విస్తాడులే అనుకొంటే.. ప్ర‌తీసారీ నిరాశే ఎదుర‌వుతుంది. ఈ సినిమాలోనూ ఇంతే. ఎంతో గంభీరంగా ఉండాల‌నుకోవ‌డం, గెడ్డం పెంచి లుక్ మారింద‌న్న భ్ర‌మ‌ల్లో ఉండ‌డం పెద్ద మైన‌స్‌. క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, కృష్ణ పాత్ర తీర్చిదిద్ద‌డంలో లోపాలు..  ఈ సినిమాని మింగేశాయి. అదేంటో ఒక్కో సీన్‌లో ఒక్కోలా యాక్ట్ చేస్తుంటాడు సునీల్‌. అస‌లు ఆ పాత్ర‌కు స్కేలేమైనా ఉందా, లేదా?  అనే అనుమానం కూడా వేస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో అయినా పెద్ద విష‌యం ఉండే ఉంటుంది అనుకొంటే అదీ.. లేదు. చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్ ఒక‌టి ప‌ట్టుకొని.. దాని చుట్టూ ప‌గ‌, ప్ర‌తీకారాలు అల్లుకోవ‌డం.. ఫూలీష్ గా అనిపిస్తుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో సునీల్ శైలి ఛ‌మ‌క్కులు ప‌డ‌బ‌ట్టి, బ్రహ్మానందం పాత్ర కాస్తో కూస్తో న‌వ్విచ‌బట్టి, సినిమా అంతా రిచ్‌గా ఉండ‌బ‌ట్టి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా బ‌ల‌మైన న‌టీన‌టులు ఉండ‌బ‌ట్టి... కాల‌క్షేపం అయిన‌ట్టు క‌నిపించింది గానీ.. లేదంటే ఈ సినిమాని ఒక్క నిమిషం భ‌రించ‌డం క‌ష్టం.
 
 
 
ఇప్ప‌టికే ఈ సినిమాని దిల్‌రాజు చాలా వ‌ర‌కూ ట్రిమ్ చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే.. అంత చేసినా.. సినిమా ఇంకా బోరింగ్‌గానే న‌డిచిందంటే.. వాసు వ‌ర్మ‌దే త‌ప్పంతా. మ‌ధ్య మ‌ధ్య‌లో పాట‌లు చిరాకు పెడ‌తాయి. రెండు పాట‌ల్ని ఏమాత్రం ఆలోచింకుండా తీసేయొచ్చు. క‌థానాయిక‌లు న‌టించింది త‌క్కువ‌.. చూపించింది ఎక్కువ అన్న‌ట్టుంది ప‌రిస్థితి. సునీల్ ఏదో క‌ష్ట‌ప‌డి డాన్సులు చేశాడు క‌దా.. అని భ‌రించ‌డం త‌ప్ప‌... లేదంటే ప్ర‌తీపాట‌కీ లేచి వ‌చ్చేయొచ్చు. అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న‌ల్ సీన్లు కొన్ని బాగానే పండాయి. ఛైల్డ్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింది. ఫ్యామిలీ వాతావ‌ర‌ణం ఉండ‌డంతో.. కాస్త రిలీఫ్ దొరికింది.
 
సునీల్ అంటే న‌వ్వించాల్సిందే. వినోదాత్మ‌క క‌థ‌ల‌పై ఆయ‌న దృష్టి పెట్ట‌డం మంచిది. కామెడీ టైమింగ్ ఈసినిమాలోనూ అదిరిపోయినా.. దాన్నిచూపించే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా వ‌చ్చింది. డాన్సుల్లో ష‌రా మామూలుగానే అద‌ర‌గొట్టేశాడు. యాక్ష‌న్ లోనూ క‌ష్ట‌ప‌డినా.. ఎందుకో ఫైట్లు సునీల్‌కి మ్యాచ్ కావు అనిపిస్తుంటుంది. హీరోయిన్లు ఇద్ద‌రిదీ అందాలు ఆర‌బోసే కార్య‌క్ర‌మ‌మే. కామెడీ గ్యాంగ్ లిస్టు పెద్ద‌దే. కానీ.. పిండుకొన్న విష‌యం చాలా త‌క్కువ‌. సాంకేతికంగా సినిమా చాలా పెద్ద స్థాయిలో ఉంది. పాట‌లు ఓకే. కానీ ప్లేస్ మెంట్ కుద‌ర్లేదు. సినిమా భ‌లే రిచ్‌గా ఉంది. కెమెరా ప‌నిత‌నం.. ఆకట్టుకొంటుంది. గౌత‌మ్‌రాజు ట్రిమ్ చేయాల్సిన సినిమా ఇంకా మిగిలిపోయింది.
 
కృష్ణాష్ట‌మి.. ఓ మిక్స్‌డ్ విజిటెబుల్ క‌ర్రీ. హీరోయిన్లు మ‌సాలా బాగానే ద‌ట్టించారు.కాక‌పోతే.. వండిన తీరే రుచీ ప‌చీ లేకుండా త‌యారైంది. మ‌ళ్లీ ఈ త‌ర‌హా కూర‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌
 
రేటింగ్ 2.5/5