Read more!

English | Telugu

దర్శక తపస్వి కె.విశ్వనాథ్

 

ఆయన సినిమాలు కళామతల్లికి ఒక నిరాజనం. అంతరించిపోతున్న మన సంస్కృతిని అద్భుతంగా ప్రజల మనసుల్లోకి తన సినిమాల ద్వారా శాశ్వతంగా ఎక్కించిన దార్శనికుడు ఆ దర్శకుడు. ఆయన సాధారణంగా కనిపించినా, ఆయన సినిమాలు మాత్రం అసాధారణమే. సరస్వతిని తన సినిమాల్లో గౌరవించినందుకు, తెలుగు ప్రేక్షకులు వాటికి లక్ష్మిని అందించి ఆదరించారు. ఇప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాలన్నింటిలోనూ, ఆయన సినిమాలు పై మెట్టులో ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు..తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల...ఇదీ ఆయన సినిమాల గురించి చెప్పగానే గుర్తొచ్చే వాక్యం. తెలుగు ప్రేక్షకులు, ఈయన మావాడు అని గర్వంగా తలెత్తి చెప్పుకోలిగిన ఆ దిగ్దర్శకుడే కె. విశ్వనాధ్. ఆ రోజు ఆయన పుట్టిన రోజు. వారి సినిమాలన్నీ అద్భుతమే అయినా, ఈ సందర్భంగా మచ్చుకు కొన్ని సినిమాలు చూద్దాం..

శంకరాభరణం (1980)

ఈ సినిమాకు ముందు ఆయన సినిమాలు తీసినా, విశ్వనాథ్ గారి పేరు వినగానే మొదట శంకరాభరణమే అందరికీ గుర్తొస్తుంది. కమర్షియల్ సినిమాలు, ఫక్తు రొటీన్ కథలతో విసిగిపోయిన తెలుగుప్రేక్షకులకు, ఎడారిలో నీటి సరస్సులా శంకరాభరణం కనిపించింది. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, హీరో హీరోయిన్ల ఘాటు సన్నివేశాలు అంటూ పక్కా ఫార్ములా ఫాలో అయిన ఆ కాలంలో, ఒక ముసలి బ్రాహ్మణుడి పాత్రనే తన  హీరోగా తెరకెక్కించాలనే ఆలోచన, ఒక సాహసం కిందే చెప్పాలి. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత కీ.శే.ఏడిద నాగేశ్వర్వావు గారిని ఒక్కసారి స్మరించుకోవడం తప్పనిసరి.
 


ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో, జె.వి.సోమయాజులు హీరోగా సినిమా ఏంటి అంటూ అందరూ పెదవి విరిచారు. కానీ తన కథనే నమ్ముకుని ముందుకు వెళ్లిన విశ్వనాథ్, కథాబలమున్న సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో రుచి చూపించారు. కొన్ని చోట్ల ఈ సినిమా ఏడాదికి పైగా ఆడటం విశేషం.

సాగరసంగమం (1983)
బాలు అనే ఒక నిరుపేద, నాట్యంలో అద్భుతమైన స్థాయికి చేరుకన్నా, ఆర్ధిక పరిస్థితి అనుకూలించదు. మాధవి అనే గొప్పింటి అమ్మాయి అతనికి సాయం చేస్తూ, ప్రేమలో పడుతుంది. అదే సమయంలో ఆమెకు అంతకు మునుపే పెళ్లయిందని తెలియడంతో, ఆమెను తన భర్తతో కలిపి, తను తాగుడుకు బానిసౌతాడు. చివరికి మాధవి కోసం, ఆమె కూతురికి నాట్యం నేర్పి తాను ఆనందంతో కన్నుమూస్తాడు.
 


మానవసంబంధాల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, సమాజంలో కళ అనేది ఎంత ఉన్నతమైందో చూపించే సినిమా సాగరసంగమం. కళకు అంతం లేదంటూ ముగించే ఈ సినిమా చూసిన తర్వాత, ప్రేక్షకులు ఒక అద్భుతమైన ఫీలింగ్ తో బయటికి వస్తారు. బి, సి సెంటర్లలో వాళ్లే ఏం సినిమా అని అనుకునేలా ఈ సినిమాను మలిచిన ఘనత కే విశ్వనాధ్ కే దక్కుతుంది.

స్వాతిముత్యం (1986)

స్వాతిముత్యానికి మాలిన్యాలేవీ అంటవు. శివయ్య కూడా అంతే. స్వచ్ఛమైన పసిపిల్లాడి మనసు అతనిది. మంచితనంతో పాటు, ప్రేమ, మొండిధైర్యం కలిగలిపిన అమాయకుడు శివయ్య. తనేం చేస్తున్నాడో తనకు తెలియకపోయినా, భర్త పోయిన పుట్టెడు దు:ఖంలో ఉన్న స్త్రీకి తిరిగి జీవితాన్ని ప్రసాదించే దేవుడిగా ఆ పాత్రను తీర్చిదిద్దారు విశ్వనాథ్. శివయ్య క్యారెక్టర్లో కమల్ హాసన్ జీవించారు.

ఇలాంటి పాత్రలో అమాయకత్వంతో పాటు అన్ని రకాల ఏమోషన్స్ ని కలిపి చెప్పడం ఒక్క విశ్వనాథ్ కే సాధ్యం అంటే అనుమానం లేదు. సినిమాలోని వటపత్రశాయి పాటను నేటికీ తల్లులు జోలపాటగా పాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. స్వాతిముత్యం మన దేశం నుంచి నుంచి ఉత్తమ పరభాషా చిత్రం కేటగీరీలో నామినేట్ అవడం విశేషం.
 

స్వయం కృషి (1987)

 

కృషితో నాస్తి దుర్భిక్షం.. ఇదే స్వయం కృషి సినిమాకు సూత్రం. చెప్పులు కుట్టుకుంటూ పూరి గుడిసెలో బ్రతికే ఒక సాధారణ సాంబయ్య, తన క్రమశిక్షణతో, కృషితో, అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది సినిమా మూల కథ. ఎంత విజయం సాధించినా, ఒదిగి ఉండటం, దురలవాట్లు, దుర్వ్యసనాలు మనిషికి ఏవిధంగా చేటు చేస్తాయో చెప్పడాన్ని ఉపకథలుగా పెట్టి సినిమా తీశారు విశ్వనాథ్. అప్పటికి సెన్సేషనల్ హిట్స్ తో పక్కా మాస్ హీరోగా ఉన్న చిరంజీవితో ఇలాంటి సుతిమెత్తటి సినిమా చేయడం, విశ్వనాథ్ చేసిన మరో సాహసం.

స్వాతికిరణం (1992)
అహంకారం సర్వనాశన హేతువు అనే పాయింట్ ను తీసుకుని విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా స్వాతికిరణం. ఈ సినిమాలోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. లోకాన్నే గెలిచినా, మనలో ఉంటే అరిషడ్వర్గాలను గెలవకపోతే, ఓడిపోయినట్లే అనే సందేశం అంతర్లీనంగా ఈ సినిమాలో ధ్వనిస్తుంది. కర్ణాటిక్ సంగీతంలో సామ్రాట్టుగా వెలుగొందే అనంతశర్మకు, ఆ జ్ఞానంతో పాటు అహం కూడా పెరుగుతుంది. తన సన్మాన సభలో అద్భుతంగా గానం చేసిన గంగాధరం అనే పదిహేనేళ్ల కుర్రాడి సంగీత జ్ఞానం చూసి అతనిలో అసూయ పుడుతుంది.

గంగాధరం తనను పాతాళానికి తొక్కేయడానికి వచ్చిన వామనుడని, అపర త్యాగయ్య అని, ఆ కుర్రాడు ఉంటే తాను బ్రతకలేనని భార్యతో చెబుతాడు. తను తల్లిదండ్రుల్లా భావించే వారిద్దరూ బాగుండాలని, ఆత్మహత్య చేసుకుంటాడు గంగాథరం. అప్పటికి జ్ఞానోదయమైన అనంతశర్మ, తన తప్పుకు తనే కుమిలిపోయి, సంగీతాన్ని వదిలేసి ఏకాంతంలోకి వెళ్లిపోతాడు. చివరికి తన భార్య నడుపుతున్న సంగీత పాఠశాలలో పిల్లలతో చేరి సంగీతాన్ని నేర్చుకుంటాడు ఒకప్పటి ది గ్రేట్ అనంతశర్మ. ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి, తన దర్శకవిశ్వరూపాన్ని చూపించారు విశ్వనాథ్.

ఇవి కేవలం కొన్ని మాత్రమే. సప్తపది, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, స్వర్ణకమలం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, శృతిలయలు, స్వరాభిషేకం, ఒకటా రెండా ఇలా ఎన్నో, ఎన్నెన్నో.. ఆయన సినిమాల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికి ఉండదు. ఆయన సినిమాల్లో శృంగారం ఉంటుంది. కానీ అది ప్రేక్షకుడికి దాని పవిత్రతను గుర్తు చేసేలా ఉంటుంది. ఆయన సినిమాలో హాస్యం ఉంటుంది. అది సున్నితంగా చక్కిలిగింతలు పెడుతుంది. విరహం, సంతోషం, భక్తి, భయం.. ఇలా నవరసాలకు ఆయన చిత్రాల్లో చోటుంటుంది. కానీ ఏవీ ప్రేక్షకుడిని నొప్పించవు. దారి తప్పించవు. కేవలం మంచి ఏదో మాత్రమే చెబుతాయి. విశ్వనాథ్ సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుడు, గుడి నుంచి బయటికి వస్తున్నట్టు భావిస్తే ఆశ్చర్యం లేదు.

కె.విశ్వనాథ్ దర్శకుల్లో ఒక కళా తపస్వి, నిరంతర సినీ తేజస్వి. తన 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ దిగ్దదర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన మరిన్ని సినిమాలతో మరిన్ని వసంతాలు చిరకాలం వర్ధిల్లాలని కోరుకుందాం..