English | Telugu
'కేజీఎఫ్-3' అప్డేట్ వచ్చేసింది.. 'సలార్'తో మల్టీవర్స్!
Updated : Apr 14, 2023
కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం పెంచేసిన సినిమా అంటే 'కేజీఎఫ్' అనడంలో ఎలాంటి సందేహం లేదు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఇప్పటిదాకా రెండు భాగాలు వచ్చాయి. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన 'కేజీఎఫ్-1' భారీ విజయాన్ని అందుకోగా.. ఇక 'కేజీఎఫ్-2' అయితే రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు 'కేజీఎఫ్-3'కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం.
'కేజీఎఫ్-2' విడుదలై నేటితో(ఏప్రిల్ 14) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసిన హోంబలే ఫిలిమ్స్.. అందులో 'కేజీఎఫ్-3' ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 'కేజీఎఫ్-2' సినిమా చివరిలోనే 'కేజీఎఫ్-3' ఉంటుందని చూపించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. మరోవైపు ప్రశాంత్ నీల్ 'సలార్'తో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత 'ఎన్టీఆర్ 31' చేయాల్సి ఉంది. దీంతో ఇప్పట్లో 'కేజీఎఫ్-3' సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కేజీఎఫ్ మేకర్స్ మాత్రం ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ.. తాజాగా విడుదల చేసిన వీడియోలో 'కేజీఎఫ్-3' ఉంటుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఆ వీడియోలో 1978 నుంచి 1981 వరకు రాకీ భాయ్ ఎక్కడున్నాడు? అనే ప్రశ్నను సంధించారు. మరోవైపు ఇది మల్టీవర్స్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' మొదలైనప్పటి నుంచి ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న సినిమా అని ప్రచారం జరుగుతోంది. 'సలార్' కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని, మొదటిభాగం చివరిలో కేజీఎఫ్ రాకీ భాయ్ ఎంట్రీ ఇస్తాడని న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు 'సలార్-2', 'కేజీఎఫ్-3' రెండూ ఒక్కటే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేశాడో చూడాలి.