English | Telugu
ఈ నగరానికి ఏమైంది?.. ఓ వైపు రీరిలీజ్, మరోవైపు టీజర్!
Updated : Jun 14, 2023
'పెళ్ళి చూపులు'(2016) సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత చేసిన 'ఈ నగరానికి ఏమైంది?'(2018) సినిమాతోనూ అదేస్థాయిలో మెప్పించారు. ఈ రెండు సినిమాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. నటుడిగా, రచయితగా ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో దర్శకుడిగా మూడో సినిమా స్టార్ట్ చేయడానికి తరుణ్ భాస్కర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో ఆయన సినిమాలను ఇష్టపడేవారు మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమా టీజర్ చూపించబోతున్నారు.
తరుణ్ భాస్కర్ కెరీర్ లో 29 కి ప్రత్యేక స్థానముంది. ఆయన మొదటి సినిమా 'పెళ్ళి చూపులు' 2016 జూలై 29న విడుదల కాగా, రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది?' 2018 జూన్ 29న విడుదలైంది. ఈ జూన్ 29 తో 'ఈ నగరానికి ఏమైంది?' విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదేరోజున తరుణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'కీడా కోలా' టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తరుణ్ భాస్కర్ సినిమాలను అభిమానించే వారికి ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.
'కీడా కోలా' అనేది క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం. ఇందులో మొత్తం ఎనిమిది ముఖ్యపాత్రలు ఉంటాయి. వాటిలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఓ పాత్ర పోషిస్తున్నారు.