English | Telugu

దేవర గురించి జాన్వీ కపూర్ కామెంట్స్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంత పెద్ద హిట్ వచ్చినప్పటికీ మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో 'దేవర' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మొదటి సారి తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండడం విశేషం.
ఇదిలా ఉండగా తెలుగులో తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ 'దేవర'గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మూడు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. షూటింగ్ సమయంలో భాషపరంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇప్పటివరకు యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రమే జరిగాయని, అందుకే లాంగ్వేజ్ కి సంబంధించి ఎలాంటి సమస్య రాలేదని, సెప్టెంబర్ నుంచి దేవర సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేసింది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.