English | Telugu
‘నువ్ కావాలయ్యా..’ పాటపై, తమన్నాపై విరుచుపడ్డ ప్రముఖ నటుడు!
Updated : Oct 25, 2023
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసేందుకు సెపరేట్‌గా నటీమణులు ఉండేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాను రాను వారికి డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే హీరోయిన్లే అలాంటి పాటల్లో ఒంపుసొంపులు చూపిస్తున్నారు కాబట్టి. ఇదేదో బాగుంది అని దర్శకనిర్మాతలు కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చి ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్నారు. ఒకప్పటి ఐటమ్ సాంగ్స్‌ని చూసి ఎంజాయ్ చేసారు తప్ప వాటిపై ఎప్పుడూ కాంట్రవర్సీ రాలేదు. కానీ, ఇప్పుడొస్తున్న ఐటమ్ సాంగ్స్ కాంట్రవర్సీ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించి వందల కోట్లు కొల్లగొట్టిన రజనీకాంత్ మూవీ ‘జైలర్’లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ కాస్తా.. అఫీషియల్‌గా స్పెషల్ సాంగ్‌గా మారింది. ‘నువ్ కావాలయ్యా..’ అంటూ సాగే ఈ పాట ఎంతో అసభ్యకరంగా ఉందని నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యానించారు. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాలోని పాట ప్రస్తావన తెస్తూ తమన్నా డాన్స్ మూమెంట్స్ ఎంతో అసహ్యంగా ఉన్నాయని కామెంట్ చేశాడు. అలాంటి పాటకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ‘నువ్ కావాలి... రారా’ అంటూ రెండు చేతుల్ని కాళ్ళ మధ్యలోకి తెస్తూ తమన్నా వేసిన స్టెప్స్ చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించాడు మన్సూర్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, కోలీవుడ్ సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మన్సూర్ అలీఖాన్ ఈ పాటను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డ్‌ను విమర్శించడానికి వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. అతను తీసిన ‘సరకు’ అనే సినిమాలోని పలు సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. కొన్ని కట్స్ ఇవ్వడమే కాకుండా చాలా సన్నివేశాలను మార్చాలని సూచించింది. దీంతో మన్సూర్ ఆగ్రహానికి గురయ్యాడు. అందుకే పనిగట్టుకొని ‘జైలర్’లోని స్పెషల్ సాంగ్‌ను, తమన్నాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. మరి దీనిపై కోలీవుడ్ సినీ ప్రముఖులు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.