English | Telugu

'జైలర్' దెబ్బకి 'భోళా శంకర్' విలవిల!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే కంటెంట్, డైరెక్టర్ తో సంబంధం లేకుండా మినిమమ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే ఆయన రీసెంట్ మూవీ 'భోళా శంకర్' మాత్రం దారుణంగా నిరాశపరిచింది. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక అసలిది మెగాస్టార్ సినిమానేనా అనిపించింది. పైగా డబ్బింగ్ సినిమా అయిన 'జైలర్' ముందు నిలబడలేక విలవిల లాడుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్', మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. 'జైలర్' ఆగస్టు 10న విడుదలై ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇక ఆగస్టు 11న విడుదలైన 'భోళా శంకర్' మొదటిరోజు రూ.30 కోట్ల లోపు గ్రాస్ కే పరిమితమైంది. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ కావడంతో మెగాస్టార్ స్థాయి ఓపెనింగ్స్ రాలేదని చెప్పొచ్చు. అయితే ఎంత రీమేక్ అయినా, పోటీలో సూపర్ స్టార్ ఉన్నా.. తెలుగునాట మెగాస్టార్ సినిమాని ఓ డబ్బింగ్ సినిమా డామినేట్ చేయడం అనేది మెగా అభిమానులు మాత్రమే కాదు సాధారణ తెలుగు సినీ అభిమానులు కూడా జీర్ణించుకోలేరు.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.38 కోట్ల షేర్ రాబట్టిన భోళా శంకర్.. రెండో రోజు నుంచి జైలర్ కంటే తక్కువ వసూళ్లను రాబడుతోంది. రెండో రోజు రూ.3.13 కోట్ల షేర్, మూడో రోజు రూ.3.17 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక తెలుగునాట మొదటిరోజు రూ.7.01 కోట్ల షేర్ రాబట్టిన జైలర్.. రెండో రోజు రూ.2.65 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.15 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.5.12 కోట్ల షేర్ తో తన హవా కొనసాగిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 'భోళా శంకర్' రూ.21.68 కోట్ల షేర్ రాబట్టగా.. 'జైలర్' రూ.18.93 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో తెలుగునాట 'జైలర్' సినిమానే ఎక్కువ వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. నిజానికి 'జైలర్' సినిమా పరవాలేదు అనిపించుకుంది కానీ మరీ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకోలేదు. ఒరిజినల్ కథ, రజినీ ఇమేజ్ కి సరిపోయే సినిమా కావడంలో నాలుగు రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అందుకే మెగాస్టార్ ఇకనైనా రీమేక్ కథలను పక్కనపెట్టి.. తన ఇమేజ్ కి సరిపోయే కొత్త కథలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.