English | Telugu
‘భోళాశంకర్’ డిజాస్టర్ గురించి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!
Updated : Oct 6, 2023
ఏ సినిమా అయినా షూటింగ్ చేయడం ఒక ఎత్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో ఎత్తు. అందులోనూ ముఖ్యమైంది ఎడిటింగ్. ఒక సినిమా ఫలితాన్ని ఒక్కోసారి ఎడిటింగ్ కూడా మారుస్తుంటుంది. ఇది చాలా సినిమాల విషయంలో రుజువైంది కూడా. కానీ, కొన్ని సినిమాలకు ఎడిటింగ్‌కి కూడా అందనంత దారుణంగా ఉంటాయి. వాటిని ఎడిటరే కాదు, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అలాంటి ఓ సినిమా అనుభవాన్ని ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ అందరితో షేర్ చేసుకున్నారు.
ఎడిటింగ్ రూమ్‌కి రష్ పంపించిన తర్వాత దాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో అమర్చేవాడే ఎడిటర్. సినిమా మొత్తం ఎడిట్ చేసిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా వుంటుందనే విషయంలో ఎడిటర్ ఒక నిర్థారణకు రావచ్చు. అయితే సాధారణంగా సినిమా బాగా లేకపోతే దాన్ని టాప్ హీరోలకు చెప్పే ధైర్యం చెయ్యరు. వారి తృప్తి కోసం సినిమా బాగా వచ్చిందనే చెబుతారు. అయితే మార్తాండ్ కె.వెంకటేష్ మాత్రం సినిమా ఎలా వుంది అనే విషయాన్ని చెప్పేందుకు ఏమాత్రం భయపడరు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘భోళాశంకర్’ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ అవుతుందని అనుకున్నాను. కానీ, నేను ఊహించిన దానికి విరుద్ధంగా రిజల్ట్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా నా అంచనా రెండోసారి తప్పింది. మొదటిది రామ్‌చరణ్ చేసిన ‘ఆరెంజ్’. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నాను. కానీ, అది కూడా డిజాస్టర్ అయ్యింది. నేను ఎడిట్ చేసిన సినిమా రిలీజ్ అయితే ఆరోజు కనీసం 20 ఫోన్లు వస్తాయి. కానీ, ‘భోళా శంకర్’కి ఒక్క ఫోన్ కూడా రాలేదు’’ అన్నారు మార్తాండ్ కె. వెంకటేష్.