English | Telugu

జగన్‌ అంటే ఇష్టమే... ఇలాగైతే బాబుకే కాదు.. ఎవరికైనా కష్టమే!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ విషయంలో ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో విశాల్‌ తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ సక్సెస్‌మీట్‌లో విలేకరులతో ముచ్చటించారు.

‘వై.ఎస్‌.జగన్‌ అంటే మీకు ఎంతో అభిమానం కదా. ఆయన ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేయడంపై మీ అభిప్రాయం?’ అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు.. విశాల్‌ సమాధానమిస్తూ ‘‘చంద్రబాబునాయుడుగారిని ఓ కేసు విషయమై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేను సినిమా బిజీలో ఉండడం వల్ల దాని గురించి డీటైల్డ్‌గా తెలీదు. అయితే జగన్‌ నాకు ఇష్టమైన నాయకుడైనప్పటికీ చంద్రబాబునాయుడులాంటి నాయకుడ్ని అరెస్ట్‌ చేశారంటే, ఇక నాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? మేం సినిమాలు తీస్తున్నప్పటికీ ఇంటికి వెళ్తే నేనూ సామాన్యుడినే. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు విషయంలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.