English | Telugu
'ఆదిపురుష్' జోరుకి బ్రేకులు.. ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్!
Updated : Jun 20, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే నాలుగో రోజైన సోమవారం ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. చాలా చోట్ల 75 శాతానికి పైగా డ్రాప్ కనిపించింది. దీంతో ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.32.84 కోట్ల షేర్, రెండో రోజు రూ.15.04 కోట్ల షేర్, మూడో రోజు రూ.17.07 కోట్ల షేర్ తో సత్తా చాటిన ఆదిపురుష్.. నాలుగో రోజు రూ.4.81 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.69.76 కోట్ల షేర్(110.40 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక కర్ణాటకలో ఇప్పటిదాకా రూ.10.81 కోట్ల షేర్ సాధించగా.. హిందీలో అయితే తెలుగు వెర్షన్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. హిందీ, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.61.98 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటిదాకా రూ.20.90 కోట్ల షేర్ వచ్చింది. దీంతో నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.163.45 కోట్ల(326.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఆదిపురుష్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కనీసం 78 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.70.11 కోట్ల షేర్, రెండో రోజు రూ.39.39 కోట్ల షేర్, మూడో రోజు రూ.42.10 కోట్ల షేర్ తో జోరు చూపించిన ఆదిపురుష్.. నాలుగో రోజు మాత్రం రూ.11.85 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. కనీసం మరోవారం బాక్సాఫీస్ దగ్గర నిలబడితేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించగలుగుతుంది. ముఖ్యంగా తెలుగునాట నష్టాలు తప్పవేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.120 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల్లో రూ.69 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. అంటే నష్టాలు తప్పించుకోవాలంటే ఇంకా 50 కోట్లకు పైగా షేర్ రావాలి. కానీ నాలుగు రోజు భారీ డ్రాప్ ని బట్టి చూస్తుంటే, నష్టాలు తప్పేలా లేవు.