English | Telugu

‘టైటానిక్‌’తో చరిత్ర సృష్టించిన కామెరాన్‌.. మరో రియల్‌ స్టోరీతో రాబోతున్నాడు!

ఎలియన్స్‌, ది అబీస్‌, టెర్మినేటర్‌ సిరీస్‌, ట్రూ లైస్‌ వంటి కమర్షియల్‌ హిట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు జేమ్స్‌ కామెరాన్‌. 1997లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘టైటానిక్‌’ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత 2009లో ‘అవతార్‌’తో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు కామెరాన్‌. ఈ సినిమా తర్వాత మరో కొత్త సినిమాను డైరెక్ట్‌ చేయలేదు. అవతార్‌కి సంబంధించిన సిరీస్‌పైనే ఆయన దృష్టి పెట్టారు.

ఇప్పుడు మరో కొత్త తరహా సినిమాకి శ్రీకారం చుడుతున్నారు కామెరాన్‌. 80 సంవత్సరాల క్రితం జపాన్‌పై అణుబాంబును ప్రయోగించింది అమెరికా. ఆగస్ట్‌ 6న హిరోషిమాపై, ఆగస్ట్‌ 9న నాగసాగిపై ఈ బాంబుల దాడి జరిగింది. ఈ యదార్థ ఘటనను తీసుకొని చార్లెస్‌ పెలెగ్రినో రచించిన ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’ ఆధారంగా సినిమా చేయబోతున్నట్టు కామెరాన్‌ తాజాగా ప్రకటించారు. హిరోషిమా నగరంపై బాంబు వేసిన ఆగస్ట్‌ 6 తేదీ తన కొత్త సినిమా గురించి తెలిపారు. 1945లో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న హ్యారీ ఎస్‌.ట్రూమాన్‌.. తాము హిరోషిమాపై పవర్‌ఫుల్‌ అణుబాంబును ప్రయోగించామని ప్రపంచానికి చెప్పిన ఆడియోతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు.

‘టైటానిక్‌’ వంటి రియలిస్టిక్‌ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ ఎదురుచూస్తున్నారు. కామెరాన్‌ నుంచి గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే సినిమా రాబోతోందని అందరూ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తన కొత్త సినిమా వివరాలను షేర్‌ చేసుకున్నారు కామెరాన్‌. ‘టైటానిక్‌ తర్వాత నాకు ఇంత మంచి కథ దొరకలేదు. నేను త్వరలో ఈ సినిమాను ప్రారంభిస్తాను’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.