English | Telugu
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను.. నెటిజన్‌పై డైరెక్టర్ ఫైర్!
Updated : Dec 12, 2023
కేరాఫ్ కంచరపాలెం వంటి హార్ట్ టచ్చింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని రూపొందించాడు. అలాగే నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి చిత్రంలో నటించాడు. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే వెంకటేష్ మహా చేసిన ఓ ట్వీట్ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇటీవల విడుదలన నాని కొత్త సినిమా హాయ్ నాన్న తనకు బాగా నచ్చిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘రెండు సినిమాలు తీశారో లేదో అప్పట్లో ‘కెజిఎఫ్’ చిత్రంపై కామెంట్ చేశారు అంటూ వెంకటేష్‌ని విమర్శించాడు. దానికి వెంకటేష్ అతనిపై ఫైర్ అవుతూ ‘వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశాం అనేది ముఖ్యం కాదు. ఏం సినిమా తీశాం అనేది ముఖ్యం. తెలుగులోని బెస్ట్ సినిమాల్లో కొన్ని నేను తీశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా బెస్ట్ సినిమాలు తీస్తాను. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంక ఊరుకోను’ అని వెంకటేశ్ సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై పోరాటం చేస్తానని చెప్పారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని స్పష్టం చేశారు.
అసలు ‘కెజిఎఫ్’పై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఏమిటి.. కొన్నాళక్రితం ఒక చర్చా వేదికలో పాల్గొన్నాడు వెంకటేష్ ఆ సందర్భంగా కెజిఎఫ్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్‌తో నెటిజన్లు, యశ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై నానా హంగామా జరిగింది. దానిపై వెంకటేష్ ఇలా స్పందించాడు.. తాను ఓ ఇండస్ట్రీని కించపరిచేందుకు అలా మాట్లాడలేదని, సినిమాలోని కల్పిత పాత్రనే తప్ప వ్యక్తిని దూషించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడా విషయాన్ని ఓ నెటిజన్ తన కామెంట్‌తో బయటికి తీసుకు రావడంతో మళ్ళీ చర్చ మొదలైంది.