English | Telugu

దిల్ రాజు చేతికి దసరా సినిమాలు!

ఈ దసరాకు బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉండనుంది. అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి', 'లియో' సినిమాలు విడుదలవుతుండగా, అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానుంది. ఈ మూడు సినిమాలపైనా మంచి అంచనాలు ఉండగా, ఒకే రోజు విడుదలవుతున్న 'భగవంత్ కేసరి', 'లియో' సినిమాల నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు బాలయ్య. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడటం అదనపు ఆకర్షణ.

ఇక 'లియో' తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి అంచనాలే ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో 'లియో'పై మంచి అంచనాలు నెలకొన్నాయి. పైగా 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ అంచనాల నేపథ్యంలోనే తెలుగు పంపిణీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా రూ.20 కోట్లకు దక్కించుకుంది. ఇక సితార నుంచి నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారని సమాచారం.

విజయ్ గత చిత్రం 'వారసుడు'(వారిసు)ని దిల్ రాజే నిర్మించగా, ఇప్పుడు విజయ్ కొత్త సినిమా 'లియో' నైజాం హక్కులను ఆయనే సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు అదేరోజు విడుదలవుతున్న మరో పెద్ద సినిమా 'భగవంత్ కేసరి' నైజాం రైట్స్ కూడా దిల్ రాజే దక్కించుకున్నారు. మొత్తానికి ఈ దసరాకు నైజాంలో దిల్ రాజు హవా కనిపించేలా ఉంది.