English | Telugu
'చంద్రముఖి-2' ట్రైలర్.. అప్పటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
Updated : Sep 3, 2023
రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'చంద్రముఖి' సినిమా 2005 లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగునాట కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి-2' వస్తోంది. అయితే ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'చంద్రముఖి'గా కంగనా రనౌత్ నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
"రాజాధిరాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక.. వేట్టయ రాజా పరాక్ పరాక్" అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్‌లో లారెన్స్ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా.. మరోటి వేట్టయ రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించబోతున్నారు. సినిమాలోని హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలను చూపించారు. నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 'చంద్రముఖి 2' చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. 'చంద్రముఖి 2'తో డైరెక్టర్ పి.వాసు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.