English | Telugu
మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో'.. ఇచ్చి పడేసిన 'బ్రో' ఫస్ట్ సింగిల్!
Updated : Jul 8, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ 'బ్రో'. తమిళ చిత్రం 'వినోదయ సితమ్' ఆధారంగా రూపొందుతున్న ఈ రీమేక్ ని మాతృక దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. తాజాగా ఈ ఫాంటసీ కామెడీ డ్రామా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ''మై డియర్ మార్కండేయ''అంటూ సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా రేవంత్, స్నిగ్థ శర్మ గానం చేశారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, ఊర్వశి రౌటేలాపై ఈ పాటని చిత్రీకరించారు.
''ఇంట్రో ఆపు.. దుమ్ము లేపు'' అంటూ మొదలై.. ''డాన్స్ బ్రో.. లైక్ బ్రో.. కమాన్ కమాన్ డాన్స్ బ్రో.. యమ యమా బీట్స్ బ్రో.. జిందగీ నే జ్యూక్ బాక్స్ బ్రో.. రచ్చో రచ్చ రాక్స్ బ్రో.. మజాపిచ్చ పీక్స్ బ్రో.. మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో'' అంటూ ఊపందుకున్న ఈ పబ్ సాంగ్ లో.. ''మై డియర్ మార్కండేయమంచి మాట చెప్తా రాసుకో.. మళ్ళీ పుట్టి భూమ్మీదికి రానే రావు నిజము తెలుసుకో.. ఏయ్ పక్క దిగి నిద్రలేచే ప్రతీరోజూ పండగ చేసుకో.. అరే ఉన్న కాస్త టైములోనే అంతో ఇంతో అనుభవించి పో'' అంటూ పవన్ పాత్ర చెప్పే వాక్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే చరణంలో ఊర్వశి ఎంట్రీ గ్లామర్ ని తీసుకువచ్చింది. మొత్తంగా 4 నిమిషాల 26 సెకండ్ల పాటు సాగే ఈ ఫస్ట్ సింగిల్ ఇటు ట్రెండీ పదాలతోనూ, అటు వేదాంత ధోరణీలోనూ సాగి.. ఇచ్చి పడేసిందనే చెప్పాలి. అయితే, నెటిజన్లలో కొంతమంది పాటని ఆకాశానికెత్తేస్తుంటే.. మరికొందరు మాత్రం 'తమన్.. నువ్వు మారవా' అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఏదేమైనా పాట మాత్రం ఇన్ స్టంట్ హిట్ అంటూ తేల్చిపడేస్తున్నారు.
ఇదిలా ఉంటే, 'బ్రో' మూవీ ఈ నెల 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.