English | Telugu
హిట్ కాంబోల ఫైట్.. 'రామబాణం'తో గోపీచంద్, 'ఉగ్రం'తో అల్లరి నరేష్!
Updated : May 4, 2023
ఈ శుక్రవారం(మే 5) రెండు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ 'రామబాణం' కాగా, మరొకటి అల్లరి నరేష్ 'ఉగ్రం'. ఈ రెండు కూడా హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలే కావడం విశేషం. హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలు ఆ హిట్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాయో లేదోనన్న ఆసక్తి నెలకొంది.
కొంతకాలంగా సరైన విజయం లేని గోపీచంద్.. తనకు 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్లను ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై గోపీచంద్ తో పాటు మూవీ టీం అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక 'లక్ష్యం'లో గోపీచంద్ కి అన్నగా కనిపించిన జగపతి బాబు.. ఈ సినిమాలోనూ అన్నగా నటించడం విశేషం. మరి గోపీచంద్-జగపతిబాబు-శ్రీవాస్ త్రయం సెంటిమెంట్ ఫలించి 'లక్ష్యం' మాదిరిగా 'రామబాణం' కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.
ఒకప్పుడు కామెడీ హీరోగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్.. 'నాంది' నుంచి ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన 'నాంది' చిత్రం నరేష్ కి మంచి పేరు తీసుకురావడంతో పాటు, మంచి విజయాన్ని కూడా అందించింది. ఇప్పుడు వీరి కలయికలో రెండో సినిమాగా 'ఉగ్రం' వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో నరేష్ పోలీస్ గా కనిపించనున్నాడు. నరేష్ గత చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలో నరేష్ తనకు 'నాంది' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ తో 'ఉగ్రం' చేశాడు. మరి ఈ 'ఉగ్రం' నరేష్ కి మరో 'నాంది' వంటి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.