English | Telugu

అమితాబ్ అలా, అశ్వనీదత్ ఇలా.. ఏది నిజం?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ప్రాజెక్ట్ కె' మూవీ షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా అమితాబ్ స్వయంగా తెలిపారు. 'ప్రాజెక్ట్ కె' కోసం హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనగా, పక్కటెములకు గాయాలయ్యాయని అమితాబ్ చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తీసుకున్న అనంతరం, ముంబై వచ్చి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అమితాబ్ పేర్కొన్నారు. అయితే నిర్మాత అశ్వనీదత్ మాత్రం 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో అమితాబ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ గాయపడినట్లు వస్తున్న వార్తలను అశ్వనీదత్ ఖండించినట్లు తెలుస్తోంది. "మా సినిమా షూటింగ్ లో అమితాబ్ గారికి ప్రమాదం జరిగిందన్న వార్తల్లో నిజం లేదు. మూడు రోజుల క్రితం అయన షూటింగ్ పూర్తి చేసుకొని, ముంబై వెళ్లిపోయారు" అని అశ్వనీదత్ చెప్పినట్లు సమాచారం. అమితాబ్ స్వయంగా 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో గాయపడినట్లు తన బ్లాగ్ లో రాసుకొస్తే, నిర్మాత అశ్వనీదత్ మాత్రం ఆ వార్తలను ఖండించడం ఆసక్తికరంగా మారింది.