English | Telugu
సినిమా సెట్స్ లో సేఫ్టీ గురించి మాట్లాడిన రెహమాన్
Updated : Mar 7, 2023
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కుమారుడు ఎ.ఆర్.అమీన్ ఇటీవల ఓ షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి స్పందించారు ఎ.ఆర్.రెహమాన్. ఇండియన్ ఫిల్మ్ సెట్స్ లో వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఉండాలని అన్నారు. ఆయన మాట్లాడుతూ ``కొన్నాళ్ల క్రితం నా కుమారుడు అమీన్, అతని స్టైలింగ్ టీమ్ పెద్ద ప్రమాదం నుంచి దేవుడి దయవల్ల బయటపడ్డారు. ముంబై ఫిల్మ్ సిటీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మన సినిమాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో మనం ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రతి సినిమా సెట్లోనూ అవి ఉండాలి. మా అబ్బాయి షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని తెలియగానే మేం వణికి పోయాం. అసలు అలా ఎందుకు జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్‌స్యూరెన్స్ కంపెనీ కూడా ఆరా తీస్తోంది`` అని అన్నారు.
అమీన్ ఓ ప్రైవేట్ వీడియో సాంగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. పైన కట్టిన షాండ్లియర్స్ ఉన్నపళాన కుప్పకూలడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అయితే దాని కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయాన్ని అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ కాదల్ కణ్మణి సినిమాతో సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు అమీన్. మ్యూజిక్‌లో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆశయంతో కృషి చేస్తున్నానని ఇంతకు మునుపు చాలా సార్లు చెప్పారు ఎ.ఆర్. అమీన్. ఎక్కువగా హిందీ ప్రొడక్షన్ హౌసులతో టై అప్ అయి, సింగిల్స్, ప్రైవేట్ సాంగ్స్,జింగిల్స్ చేస్తున్నారు ఎ.ఆర్. అమీన్.