English | Telugu
చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు
Updated : Dec 22, 2025
చిత్ర పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే వాటిని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం.. సినీ ప్రముఖులతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాన్ని పక్కా ప్రణాళికతో జరుపుతామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మొదట సినిమాటోగ్రఫీ, హోంశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యల గురించి అధికారులు చర్చిస్తారు.
దీని తర్వాత పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, దర్శకులతో ప్రభుత్వం నేరుగా భేటీ అవుతుంది. అధికారులు అందించిన నివేదిక ఆధారంగా ఆచరణ యోగ్యమైన పరిష్కారాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమతోపాటు ప్రేక్షకులు ఎదుర్కొంటున్న అధిక టికెట్ ధరల విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వ్యయంతో రూపొందే సినిమాల విషయంలో టికెట్ రేట్ల పెంపుదలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించనున్నారు. ప్రతిసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక స్థిరమైన నిబంధనలు తెచ్చే అవకాశం ఉంది.
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమావేశం గురించి వివరిస్తూ.. “చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం సానుభూతితో వింటోంది. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ, పెద్ద సినిమాల పెట్టుబడి భద్రత రెండూ మాకు ముఖ్యమే. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తాం” అని పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం ఈ సమావేశం సక్సెస్ అయితే థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు, ప్రేక్షకులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది.