English | Telugu
కారులోనే మరణించిన నటుడు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు!
Updated : Nov 19, 2023
ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో విషాద వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు అనారోగ్యంతో మరణిస్తుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరి మృతి అనుమానాస్పదంగా మారుతోంది. తాజాగా మరో మరణవార్త సినీ పరిశ్రమ వినాల్సి వస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద మృతి ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్ దగ్గరలో ఓ కారు ఎంతో సేపటి నుంచి పార్క్ చేసి ఉండడాన్ని గమనించారు. అందులో ఓ వ్యక్తి చలనం లేకుండా ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వినోద్ మరణ వార్త వెలుగులోకి వచ్చింది.
కారులో విగతజీవిగా పడి ఉన్న వినోద్‌ను వెంటనే హాస్పిటల్‌కి తరలించామని, అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారని పోలీసులు వివరించారు. వినోద్ మృతికి కారణం ఏమిటో ఇంతవరకు తెలియలేదు. కారు ఏసీలో నుంచి వచ్చిన విషపూరిత వాయువు వల్లే అతను మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇది ఎవరైనా పథకం ప్రకారం చేశారా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే విషయాలు పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి సినిమాల్లో నటించిన వినోద్ థామస్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వినోద్ హఠాన్మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.