English | Telugu
కంగనను పొగిడిన యామీ గౌతమ్
Updated : Mar 2, 2023
కొన్ని విషయాలు జరిగినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి విషయాల్లో ఒకటి కంగనరనౌత్‌ని పొగడటం. కంగనకు ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవే ఉంటుంది తప్ప, ఆమెను పొగిడే మహిళలు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. రీసెంట్‌గా నెట్టింట్లో ఓ క్లిప్ వైరల్ అయింది. అందులో కంగన అంటే తనకు చాలా ఇష్టమని జ్యోతిక చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. వెంటనే జ్యోతికను కూడా పొగిడేశారు కంగన. చంద్రముఖిలో జ్యోతిక చేసిన పాత్రకు తాను 100 శాతం న్యాయం చేయలేనేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. జ్యోతికను ఫాలో అవుతున్నారు నార్త్ నాయిక యామీ గౌతమ్ ధర్. కంగన పెర్ఫార్మెన్స్ సూపర్ అనేశారు యామీ గౌతమ్. అంతటితో ఆగలేదు. దేశంలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో కంగన ఉంటారని అన్నారు. ఇందుకు థాంక్స్ చెప్పారు కంగన. కంగన, యామీ ఇద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌కి చెందినవారే.
యామీ గౌతమ్‌కి పెళ్లవుతున్నప్పుడు, కొండప్రాంతాల నుంచి వచ్చిన కొత్తపెళ్లికూతురుని చూస్తుంటే ఆనందంగా ఉంది అని సోషల్ మీడియాలో రాశారు కంగనా రనౌత్. ఆ ఒక్క సందర్భమే కాదు, ఎప్పుడు అవకాశం వచ్చినా యామీగౌతమ్ గురించి చాలా బాగా చెబుతుంటారు. యామీ ఓ సారి మనాలీలో లాస్ట్ కోసం షూటింగ్ చేస్తున్నారట. రెండు రోజులు ఆమె అక్కడుంటారని తెలిసి ఇంటికి ఆహ్వానించారట కంగన. కానీ యామీకి హెక్టిక్ షూటింగ్ వల్ల వెళ్లడానికి కుదరలేదట. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తనవారు అనుకున్నవారి బాగోగులను కంగన చాలా బాగా చూసుకుంటారు. అలాంటి మనసు అందరికీ ఉండదు. నాకు ఆ విషయంలోనూ ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని అన్నారు కంగన. రీసెంట్‌గా ఎమర్జన్సీ షూటింగ్ పూర్తి చేశారు కంగన. ప్రస్తుతం చంద్రముఖి2 సినిమా సెట్లో ఉన్నారు. యామీ గౌతమ్‌కి ఇటీవల లాస్ట్ విడుదలైంది. ప్రస్తుతం మరో సినిమా పనుల్లో ఉన్నారు యామీ గౌతమ్ ధర్.