English | Telugu
‘వీక్షణం’ మూవీ రివ్యూ
Updated : Oct 18, 2024
రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'వీక్షణం'. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదలైంది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ తో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది. అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేయగా చివరికి ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె ప్రేమలో పడుతుంది. నేహాతో గొడవ అయిన సమయంలో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా ఒక అమ్మాయి రోజుకొక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. ముందు పెద్దగా సీరియస్ గా తీసుకోడు కానీ ఆ అమ్మాయి ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని భావించి ఆమె మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తుంది. అయితే చనిపోయి ఎనిమిది నెలలు అయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అసలు ఆర్విన్ చూసింది నిజమేనా? ఆ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని.. మన పని మనం చూసుకోవడం. ఆ పాయింట్ తోనే ఈ కథను రాసుకున్నాడు డైరెక్టర్ మనోజ్. పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసే హీరో.. ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఏమిటి? ఆ ఇబ్బందులని ఎలా అధిగమించాడు? అనే విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా, ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ తో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరికీ మధ్య గొడవలు ఏర్పడటం, హీరో మరో అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయి చనిపోయింది అనే విషయం తెలియడం వంటి విషయాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా నడిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ఇక సెకండ్ హఫ్ లో.. చనిపోయిన అమ్మాయి హత్యలు ఎలా చేస్తుంది? అని హీరో మరియు అతని స్నేహితులు కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్.. రొటీన్ కి భిన్నంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చేలా ఉండడం గమనార్హం.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అర్విన్ పాత్రలో రామ్ కార్తీక్ ఒదిగిపోయాడు. పక్క వాళ్ళ విషయాల మీద ఆసక్తి కనబరిచే ఒక సగటు కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ కశ్వి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కికి మంచి పాత్ర లభించింది. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. షైనింగ్ ఫణి బాగానే నవ్వులు పంచాడు. మిగతా పాత్రధారులు పాత్రల పరిధి మేరకు నటించారు.
థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అద్భుతంగా అందించి, సినిమాని మరింత ఎలివేట్ చేసేలా చేశాడు సంగీత దర్శకుడు. ఆయన అందించిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సమయంలో కెమెరామెన్ పనితనం కనబడింది. సినిమాలోని ఫైట్స్ కూడా భిన్నంగా అనిపించాయి. ఫైట్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా...
వీక్షణం బాగానే థ్రిల్ ని పంచింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5