English | Telugu
ఎమ్మెస్‌ని మర్చిపోయిన s/o సత్యమూర్తి
Updated : Mar 17, 2015
విలువలే ఆస్తి అంటూ గొప్పగా ట్యాగ్‌లైన్ పెట్టాడు త్రివిక్రమ్. ఆయనెప్పుడూ విలువలున్న సినిమా తీస్తాడు..నో డౌట్. అయితే ఆయన ఆడియో ఫంక్షన్లోనే విలువలకు తిలోదకాలిచ్చేశారు. ఓ మనిషిని మర్చిపోయి.. దారుణమైన అన్యాయం చేశారు. ఆయనే ఎమ్మెస్ నారాయణ. త్రివిక్రమ్ సినిమాల్లో ఎమ్మెస్ నారాయణకు ఎప్పుడూ మంచి పాత్ర పడుతుంది. రచయితగా, దర్శకుడిగా ఆయన ఎమ్మెస్‌ని బాగానే వాడారు. సినిమా భాషలో చెప్పాలంటే పిండేశారు. ఒక విధంగా సన్నాఫ్‌సత్యమూర్తి సినిమానే ఎమ్మెస్ ఆఖరి పెద్ద సినిమా. ఈ సినిమాలో ఎమ్మెస్ ఓ మంచి పాత్ర పోషించారు. ఆయన లేకుండా ఆడియో ఫంక్షన్ చేస్తున్నప్పుడు కనీసం ఆ పేరుని ప్రస్తావించుకోవడం, ఓ నిమిషం మౌనం పాటించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని విలువలున్న ఇలాంటి ఓ సినిమాలో, విలువల గురించి లెక్చర్లు ఇచ్చే ఓ పెద్దాయన సమక్షంలో, విలువల గురించి పేజీలు పేజీలు డైలాగులు రాసే మాటల మాంత్రికుడి ఆధ్వర్యంలో తుంగలో తొక్కేశారంటే ఆశ్చర్యం వేస్తోంది. డాన్సుల గోలలో ఎమ్మెస్ మరణాన్ని మర్చిపోయారా? పొగడ్తల కార్యక్రమంలో పడి ఈ సినిమాలో పనిచేసిన ఓ విలువైన ఆర్టిస్టుని మర్చిపోయారా?? త్రివిక్రమ్ నీకిది న్యాయమా??