English | Telugu
అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది లియో!
Updated : Feb 13, 2023
అభిమానులు ఎంతగా అయినా ఊహించుకోవచ్చు. అయితే వారి అంచనాలకు మించి ఉంటుంది లియో సినిమా అని అన్నారు డైలాగ్ రైటర్ రత్నకుమార్. లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ హీరోగా నటిస్తున్నారు. మాస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్‌తో కలిసి డైలాగులు రాస్తున్నారు రత్నకుమార్, ధీరజ్ వైత్తి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రత్నకుమార్. లియో సినిమా గురించి మాట్లాడుతూ ``మీరు అడిగిన అప్‌డేట్స్ అన్నిటినీ ఇచ్చేశారు. ఇక ఇప్పట్లో అప్‌డేట్లు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. షూటింగ్ పూర్తయితేగానీ అప్‌డేట్లు ఉండవు. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ ఏ ఆటంకం లేకుండా జరుగుతోంది. మీ అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నా సరే, వాటన్నిటినీ మించి ఉంటుంది లియో. ఇది లోకేష్ కనగరాజ్ యూనివర్శ్‌లోనే ఉంటుందా? లేకుంటే సరికొత్తగా ఉంటుందా? అనేది మాత్రం సస్పెన్స్`` అని అన్నారు.
సినిమా టైటిల్‌ని ఇంగ్లిష్‌లో ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ``ఇది ప్యాన్ ఇండియా సినిమా. అందుకే సినిమా టైటిల్‌ని అందరికీ అర్థమయ్యేరీతిలో పెట్టాం. దానికి తగ్గట్టు టైటిల్ చాలా సూక్ష్మంగా పెట్టాలని అనుకున్నాం. అందుకే లియో అనే పేరును కథానుగుణంగా ఫిక్స్ చేశాం. ఆల్రెడీ స్క్రీన్‌ప్లే, డైలాగ్ వెర్షన్ పూర్తయింది. బౌండెడ్ స్క్రిప్ట్ తోనే షూటింగ్ చేస్తున్నారు. రైటర్‌గా నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ సినిమా. ఇప్పటికే చాలా చెప్పేశాను. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏమీ లేవు`` అంటూ నవ్వేశారు. ఈ సినిమాను ముందు దీపావళి బరిలో నిలుపుతారని అనుకున్నారు.అయితే అంతకన్నా ముందే అక్టోబర్ 19న విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్.