English | Telugu
ఫ్యామిలీ డైరెక్టర్ వర్మ..!!!
Updated : Jan 22, 2015
రాంగోపాల్ వర్మని ప్రేక్షకులు నమ్మినా నమ్మకపోయినా నిర్మాతలు మాత్రం గట్టిగా, ఆమాటకొస్తే గుడ్డిగా నమ్మేస్తున్నారు. `మాతో సినిమా చేయండి.. మాతో సినిమా చేయండి..` అంటూ వెంటపడుతున్నారు. అందుకే ఆయనా ఎవ్వరినీ కాదనక, యమ స్పీడుగా సినిమాలు చుట్టేస్తున్నాడు. మంచు కుటుంబంతో రాంగోపాల్ వర్మ ఎటాచ్‌మెంట్ అలాంటిలాంటిది కాదు. ఆ ఫ్యామిలీతో ఫెవికాల్ వేసుకొని మరీ అతుక్కుపోయాడు వర్మ. దాదాపుగా మంచు ఫ్యామిలీలోని నటులందరితోనూ సినిమాలు తీశాడు వర్మ. ఆఖరికి మంచు లక్ష్మి పాదాల్నీ వదల్లేదు. మోహన్‌బాబుతో రౌడీ, విష్ణుతో అనుక్షణం సినిమాల్ని తీసిపెట్టాడు. రౌడీ ఫ్లాప్ అయినా.. అనుక్షణం సినిమాకి మాత్రం డబ్బులు బాగానే వచ్చాయి. ఈ సినిమాని తన తెలివి తేటలతో లాభాల బాటపట్టించాడు వర్మ. అందుకనేనేమో విష్ణు వర్మని ఇంకా ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. లెటెస్టుగా తన తమ్ముడ్ని వర్మ చేతిలో పెట్టాడు. యస్.. మంచు మనోజ్‌తో వర్మ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. స్కిప్టు కూడా సిద్ధమైపోయిందట. వర్మ సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న మనోజ్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేసి రంగంలో దూకేయడానికి సిద్ధమైపోయాడు. మరి ఈసారి ఎలాంటి కళాఖండాన్ని సృష్టిస్తాడో వర్మ. మొత్తానికి మనోజ్‌తో సినిమా చేస్తూ.. మోహన్ బాబు ఫ్యామిలీలోని అందరితోనూ సినిమాలు చేసిన దర్శకుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కేశాడు.