English | Telugu

రావ‌ణాసురుడిగా.. నాగార్జున‌

విభిన్న‌మైన క‌థ‌ల్ని, వైవిధ్య‌మైన పాత్ర‌ల్ని ఎంచుకోవ‌డంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఆయ‌న కెరీర్‌లో మాస్‌, క్లాస్ అని తేడా లేకుండా మెప్పించింది అందుకోస‌మే. ఇప్పుడు నాగ్‌కి ఓ పాత్ర‌పై మ‌న‌సు ప‌డింది. అదే రావ‌ణాసురిడి పాత్ర‌. రావ‌ణాసురుడి పాత్ర‌లో ఎన్నో పార్శ్వాలున్నాయ‌ని, ఆ పాత్ర‌లో రాణించ‌డం ఏ న‌టుడికైనా ఓ ఛాలెంజ్ అంటున్నాడు నాగ్‌. ఎవ‌రైనా అలాంటి పాత్ర‌తో వ‌స్తే.. న‌టించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు.

అసుర అనే ఓ పుస్త‌కం కూడా నాగార్జున‌ని బాగా ఆక‌ట్టుకొంది. ఆనంద్ నీల‌కంఠ‌న్ ర‌చించిన ఈ పుస్త‌కం.. సోషియో ఫాంట‌సీ చిత్రానికి ప‌నికొచ్చే క‌థావ‌స్తువు. అందుకే ఈ పుస్త‌కాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో నాగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లి లాంటి జానప‌ద చిత్రాలు చేయ‌డానికి రెడీగా ఉన్నాన‌ని, బాహుబ‌లిలో త‌న‌కు చోటు ల‌భించ‌నందుకు చాలా అసూయ‌గా ఫీలౌతున్నాన‌ని చెప్పుకొచ్చాడు నాగ్‌.

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు రావ‌ణ అనే పేరుతో ఓ స్ర్కిప్టు త‌యారు చేసుకొన్నారు. మోహ‌న్‌బాబు బ్యాన‌ర్‌లో ఆ సినిమాని తెర‌కెక్కించాల‌నుకొన్నారు. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ స్ర్కిప్టుపై నాగ్ క‌న్నుప‌డిందేమో మ‌రి.