English | Telugu
'గుంటూరు కారం'లో హిట్ బ్యూటీ!
Updated : Jun 27, 2023
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా మొదట పూజ హెగ్డే, శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో.. మొదట సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఇప్పుడు రెండో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
'గుంటూరు కారం'లో రెండో హీరోయిన్ గా సంయుక్త మీనన్, ఫరియా అబ్దుల్లా, సాక్షి వైద్య, మాళవిక మోహనన్ వంటి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ అవకాశం అనూహ్యంగా మీనాక్షి చౌదరిని వరించినట్లు తెలుస్తోంది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి.. 'ఖిలాడీ', 'హిట్-2' వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమెకు 'గుంటూరు కారం' రూపంలో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాతో మీనాక్షి కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.
'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పిఎస్ వినోద్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.