English | Telugu
మట్కా మూవీ రివ్యూ
Updated : Nov 14, 2024
తారాగణం: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోని, కిషోర్, అజయ్ ఘోష్, సత్యం రాజేష్, పి. రవిశంకర్ తదితరులు
సంగీతం: జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఆర్
రచన, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి
బ్యానర్స్: వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్
విడుదల తేదీ: నవంబర్ 14, 2024
కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej). అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. వరుణ్ తేజ్ సోలో హీరోగా చేసిన చివరి మూడు సినిమాలు 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో 'మట్కా' (Matka) పైనే ఆశలు పెట్టుకున్నాడు వరుణ్. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో వరుణ్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకాన్ని కలిగించింది. మరి మట్కా ఎలా ఉంది? వరుణ్ తేజ్ ని హిట్ ట్రాక్ ఎక్కించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం. (Matka Movie Review)
కథ:
తన తల్లితో కలిసి బర్మా నుంచి వైజాగ్ కి వస్తాడు వాసు(వరుణ్ తేజ్). చిన్నతనంలోనే హత్య కేసులో జైలుకి వెళ్లిన వాసు, తిరిగి వచ్చాక పూర్ణ మార్కెట్ కి చేరుకుంటాడు. అక్కడ కొబ్బరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఈ క్రమంలో ఒక గొడవలో గ్యాంగ్‌స్టర్ కె.బి.రెడ్డి(జాన్ విజయ్) మనుషులను కొట్టి, అతని ప్రత్యర్థి నాని బాబు (కిషోర్)కి దగ్గరవుతాడు. నాని బాబు క్లబ్బులు నడుపుతూ రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచనలో ఉంటాడు. అతని అండదండలతో వాసు పూర్ణ మార్కెట్ కి నాయకుడిగా ఎదుగుతాడు. బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మట్కా అనే కొత్త జూదం వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో వాసుకి ఎదురైన సవాళ్లు ఏంటి? మట్కా ఆటలోకి ప్రవేశించాక అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
గ్యాంగ్‌స్టర్ కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. సామాన్యుడైన హీరో.. నేర సామ్రాజ్యంలో అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ కామన్ గా ఉంటుంది. అయితే పాయింట్ కామన్ అయినప్పటికీ.. దాని చుట్టూ కథనాన్ని, సన్నివేశాలను ఎలా అల్లుకున్నామనేది కీలకం. కానీ మట్కాలో అదే కొరవడింది. ఒక రొటీన్ కథను మరింత రొటీన్ గా తెరకెక్కించారు.
వాసు పాత్రను పరిచయం చేస్తూ మట్కా సినిమా ప్రారంభమైన తీరు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వాసు ప్రయాణమే చాలా చప్పగా సాగింది. కథనం ఆసక్తికరంగా లేదు, సన్నివేశాలలో కొత్తదనం లేదు. ఇలాంటి కథకు, హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయాలి. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి, చివరివరకు ట్రావెల్ అవ్వగలిగేతేనే సినిమా మెప్పిస్తుంది. కానీ ఇందులో ఏ దశలోనూ వాసు పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. పోనీ మెయిన్ స్టోరీలోకి వెళ్లిన తర్వాత అయినా.. ఎంగేజింగ్ గా ఉంటుందా ఉంటే అదీ లేదు. హీరో పాత్రకి బలమైన సవాళ్లు ఎదురుకావు. అసలు తనకు ఎదురే లేదన్నట్టుగా అన్నీ చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాడు. దాదాపు సన్నివేశాలన్నీ సినిమాటిక్ గానే ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయినా కాస్త పరవాలేదు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. ఏకంగా దేశ ఆర్ధిక వ్యవస్థకే ముప్పులా మట్కా మారుతుంది. ఈ క్రమంలో మట్కా కింగ్ అయిన వాసుని పట్టుకోవడానికి సీబీఐ ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు వాసు సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతని ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వాసుకి ఎన్నో సవాళ్లు ఎదురు కావాలి. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. చూసే ప్రేక్షకులకు కలగాలి. కానీ ఏ సందర్భంలోనూ అలాంటి ఉత్కంఠ కలగదు. పతాక సన్నివేశాలు కూడా మెప్పించలేదు.
మట్కా రచయితగా దర్శకుడు కరుణ కుమార్ ఏమాత్రం మెప్పించలేకపోయారు. మట్కా అనే కొత్త పాయింట్ తీసుకుంటే సరిపోదు.. కథనం, సన్నివేశాల్లో కొత్తదనం ఉండాలనే విషయాన్ని ఆయన పూర్తిగా మరిచారు. జి.వి. ప్రకాష్ సంగీతం మెప్పించింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటిగా నిలిచింది. ఏ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
వాసు పాత్రలో వరుణ్ తేజ్ చక్కగా ఒదిగిపోయాడు. విభిన్న దశల్లో జరిగే కథ కావడంతో.. అందుకు తగ్గట్టుగా లుక్స్ పరంగా, బాడీ ల్యాంగ్వేజ్ పరంగా వైవిధ్యం చూపించాడు. నటుడిగా వరుణ్ తేజ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మీనాక్షి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సినిమాలో ఎందరో పేరున్న నటీనటులు ఉన్నారు కానీ, వారి పాత్రలు గుర్తుంచుకునే అంత గొప్పగా లేవు.
ఫైనల్ గా...
కొత్తదనం లేని కథ, ఆసక్తి రేకెత్తించని కథనంతో మట్కా సినిమా చప్పగా సాగింది. వరుణ్ తేజ్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.
రేటింగ్: 2.25/5