English | Telugu
లీకైన బాహుబలి స్టోరీ
Updated : May 21, 2014
భారీ అంచనాలతో, భారీ తారాలతో, భారీగా తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం ఆడియో కూడా విడుదల కాకముందే ఎంతో హైప్ తెచ్చుకుంది. ఆరడుగుల అందగాళ్లు రానా, ప్రభాస్ రాజుల గెటప్స్‌తో కనిపిస్తున్న ఈ చిత్రకథ ఎలా ఉండబోతుందో అనే విషయం పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని వుంది. అనుష్క, తమన్నా ఇందులో కథానాయికలుగా ప్రముఖపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అడవి శేషు, సుదీప్ వంటి నటులు కూడా వున్నారు. ఈ చిత్రం కోసం, ఈ చిత్రంలో తమ పాత్రల కోసం అందరూ కష్టపడిన వారే.
మరి ఇంత ఎక్సైటింగ్ మూవీ ఎలా వుండబోతుందనే కుతూహలం అందరిలో వుంది. చాలా కాలంగా షూటింగ్ నిర్వహిస్తున్న ఈ యూనిట్ ఈ మధ్యే బ్రేక్ తీసుకుంది. ఈ సమయంలో సినిమా గురించిన కొన్ని విషయలు లీక్ అయినట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. వాటి ప్రకారం ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో అనుష్క గర్భవతిగా కనిపించనుందట. రానా క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ తర్వాత కనపడదట. ఇక ప్రభాస్ కూడా ఫస్ట్ పార్ట్‌లో చనిపోయి, సెకండ్ హాఫ్‌లో అనుష్కకు కొడుకుగా పుడతాడట. ఆ ప్రభాస్ క్యారెక్టర్‌కి తమన్నా హీరోయిన్. అలాగే ఇందులో రానా కొడుకుగా అడవి శేషు నటిస్తున్నాడని, అతను ప్రభాస్‌తో యుద్ధం చేస్తాడట. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఇద్దరి మధ్య పగతో కూడుకున్న వాతావరణం ఉంటుదని తెలిసిందే. ఈ వివరాలను బట్టి సినిమా కథ మరింత వివరంగా ఎవరికి వారే ఊహించుకోగలరు. ఇక రాజమౌళి రెండు జన్మలు, డబుల్ యాక్షన్ ఫార్ములాని ఇందులో కూడా వాడబోతున్నారని అనిపించకమానదు.
ఈ చిత్రం గురించిన విషయాలేవి బయటకు రాకుండా ఈ చిత్ర బృందం చాలా జాగ్రత్త పడుతూ వస్తోంది. కాబట్టి లీకైన సమాచారం వాస్తవం కాకపోయినా ఆశ్చర్యం లేదు.