English | Telugu
కొరటాలకు చిరంజీవి మెసేజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి..?
Updated : Sep 24, 2024
డిజాస్టర్ మూవీ 'ఆచార్య' దెబ్బకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో చిరంజీవి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సైతం దానికి బలం చేకూర్చాయి. "ఆచార్య రిజల్ట్ పూర్తి బాధ్యత డైరెక్టర్ దే", "కొందరు దర్శకులు తమలాంటి సీనియర్లు సూచనలిచ్చినా తీసుకోరు" వంటి వ్యాఖ్యలు కొరటాలను ఉద్దేశించే అని భావించారంతా. ఇక ఇటీవల 'దేవర' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ.. "ఎవరి పని వాళ్ళు చేయాలి.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చకూడదు" అని కామెంట్స్ చేయగా.. అది చిరంజీవిని ఉద్దేశించే అనుకున్నారు కొందరు. కానీ అసలు చిరంజీవితో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని చెప్పి తాజాగా షాకిచ్చాడు కొరటాల.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' (Devara) సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు కొరటాల. ఈ సందర్భంగా చిరంజీవి వివాదంపై స్పందించాడు. "ఆచార్య విడుదల తర్వాత, దేవర స్టార్ట్ చేయడానికి ముందు.. నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతారు శివ అని ఆయన మెసేజ్ చేశారు. చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధముంది. ఆయన నన్నేదో అన్నారని లేని దానిని హైలైట్ చేశారు." అని కొరటాల చెప్పుకొచ్చాడు. కొరటాల చేసిన తాజా కామెంట్స్ టాప్ టాపిక్ గా మారాయి. 'ఆచార్య' తర్వాత మెగా ఫ్యాన్స్ కి కొరటాల టార్గెట్ అయ్యాడు. ఆయన లేటెస్ట్ కామెంట్స్ తో మెగా అభిమానులు కూల్ అవుతారేమో చూడాలి.