English | Telugu

జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష!

సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. గతంలో వారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై చేసిన ఆరోపణల కేసులో వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.

రక్తం అందక ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి తన పేరుతో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. అయితే ఆ బ్లడ్ బ్యాంక్ పై 2011 లో జీవిత, రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం నాడు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించడంతో వారికి పైకోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది.