English | Telugu
మొదటి ప్రేమకి మరణం లేదు.. హృదయాన్ని హత్తుకునేలా 'బేబీ' టీజర్
Updated : Nov 21, 2022
'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. రెండో సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'పుష్పక విమానం', 'హైవే' సినిమాలతో పలకరించిన ఆనంద్ త్వరలో 'బేబీ' అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సోమవారం సాయంత్రం ఈ మూవీ టీజర్ విడుదలైంది.
ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న 'బేబీ' మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. "మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది" అంటూ ప్రారంభమైన ఈ టీజర్ హృదయాలను హత్తుకునేలా ఉంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ఆహ్లాదకరంగా టీజర్ సాగింది. ఇక చివరిలో హీరో, హీరోయిన్ మధ్య మూడో వ్యక్తి రాకతో టీజర్ ని ముగించి సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు.
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ బుల్గేనిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.