English | Telugu
'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో అమితాబ్ కి గాయాలు!
Updated : Mar 6, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో అమితాబ్ గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'ప్రాజెక్ట్ కె'కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా అమితాబ్ గాయపడ్డారు. పక్కటెముకలకి గాయాలవ్వడంతో మూవీ టీం వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ముంబై వెళ్లిన బిగ్ బి.. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నొప్పి బాధిస్తుందని, గాయం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొనడానికి కొంత సమయం పడుతుందని అమితాబ్ తెలిపారు. 80 ఏళ్ల వయసులోనూ అమితాబ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని, ఇక మీదట ఇలాంటి రిస్కీ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొనవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.